హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు ఇచ్చారు. కాలేజీకి ఎస్యూసీఈ (SUCE) కోడ్ కేటాయించామని తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశం లో కాలేజీ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాలేజీలో ఐదు బ్రాంచీలుండగా, ఒక్కో బ్రాంచిలో 60 సీట్ల చొప్పున మొత్తంగా 300 సీట్లున్నట్టు మంత్రి తెలిపారు. సీఎస్ఈ, సీఎస్ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఈసీఈ, ఐటీ, బయో టెక్నాలజీ వంటి కోర్సులున్నాయని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో తరగతులు నిర్వహిస్తామని, అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కల్పించామని వెల్లడించారు. 36 ఎకరాలు, శాశ్వత భవనాల నిర్మాణానికి రూ. 44.12 కోట్లు మంజూరుచేశామని తెలిపారు.