Ponnam Prabhakar | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన రవాణా అభివృద్ధి మండలి 42వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ రవాణాశాఖ అమలు చేస్తున్న విధానాల గురించి వివరించారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలో ఆటోమాటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లను పరిశీలించారు. దేశంలో ఎకడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పారులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.