వనపర్తి : గణపసముద్రం పునర్నిర్మాణంతో ఘణపురం ఖ్యాతిని పెంచుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 800 ఏండ్లకు పైగా చరిత్రగల గణపసముద్రం పునర్నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. సప్తసముద్రాల కన్నా ముందే కాకతీయ సామంతరాజులు గణపసముద్రాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఘణపురం గ్రామానికి ఇబ్బంది లేకుండా గణపసముద్రం చుట్టూ కరకట్టల నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు చేపడుతామని మంత్రి తెలిపారు. ఘణపురం కోట ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి కాబట్టి పర్యాటకం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గణపసముద్రానికి ఘణపురం కాలువ అనుసంధానం చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. బుద్దారం చెరువు కట్ట, గణపసముద్రం కట్టను నిపుణుల కమిటీ పరిశీలించింది. బుద్దారం కట్ట ఎత్తు పెంపుకై పరిశీలించారు. బుద్దారం స్టేజ్ 1 పనులను త్వరలో ప్రారంభించాలన్నారు. బుద్దారం కాలువ కింద ఆయకట్టు కోసం సర్వే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. కల్వకుర్తి ఆయకట్టు కింద ఆన్ లైన్ రిజర్వాయర్లను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. పంటలు కోత దశకు వచ్చేసరికి నీళ్లు లేక ఎండుతున్నాయి.. ఆన్ లైన్ రిజర్వాయర్లతో ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఏదుల రిజర్వాయర్ వద్ద తూము నిర్మించాలని ఆదేశించారు. గణపసముద్రం, బుద్దారం పెద్దచెరువులను రిజర్వాయర్లుగా మారుస్తూ ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్ రెడ్డితో నీటిపారుదల నిపుణుల కమిటీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఈ (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) శ్రీనివాస్, వనపర్తి చీఫ్ ఇంజినీర్ రఘునాథ్ రావు , నాగర్ కర్నూలు చీఫ్ ఇంజినీర్ హమీద్ ఖాన్, ఎస్ఈలు సత్యనారాయణ రెడ్డి, సత్యశీలారెడ్డి, శ్రీనివాస్, డీఈ సత్యనారాయణ గౌడ్ తదితరులు హాజరయ్యారు.