హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం ఇతర వ్యవసాయ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఈజిప్ట్ శాస్త్రవేత్తలు ప్రశంసించారు. ఇలాంటి పథకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయానికి ఊతమిస్తాయన్నారు. ఈజిప్ట్ పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం కైరోలోని అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్‌ను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలను సన్మానించారు. ఈ సందర్భంగా వారితో భేటీ అయిన మంత్రి మాట్లాడుతూ ఈజిప్ట్‌లో 95% ఎడారి ఉన్నప్పటికీ 5% సాగుభూమిలో అద్భుతాలను సృష్టిస్తున్నదని ప్రశంసించారు.
వ్యవసాయ యాంత్రీకరణలోనూ ముందున్నారని పేర్కొన్నారు. ఉద్యాన పంటల ప్రాధాన్యాన్ని గుర్తించిన ఈజిప్ట్ ..రైతులను వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లించి.. యూరప్ దేశాలకు ఉద్యాన ఉత్పత్తులను ఎగుమతిచేసే స్థాయికి చేర్చిందని అభినందించారు. ఈజిప్ట్, తెలంగాణలో.. వాతావరణ, వ్యవసాయ విధానాలు ఒకేవిధంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో తెలంగాణలో వ్యవసాయం రూపురేఖలు మారినట్టు వివరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు ఏఆర్సీ ప్రెసిడెంట్ మహ్మద్ సాల్మన్, హెచ్ అమ్మర్, షిరీన్ అస్సెమ్, మహ్మద్ అహ్మద్సాద్ పాల్గొన్నారు.