ఎమ్మెస్పీ దేనికి ఇస్తున్నారు? ధాన్యానికా? బియ్యానికా? రా రైస్కో.. బాయిల్డ్ రైస్కో.. ఇస్తున్నామా? ఒప్పందంలో‘ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ’ అనే ఉంది. రైస్ అని కాదు. కాబట్టి కేంద్రం వడ్లు కొనాల్సిందే. దాన్నిరా రైస్‌గా మార్చుకొంటారో లేక బాయిల్డ్ రైస్‌గా మార్చుకొంటారో కేంద్రం ఇష్టం.
పంజాబ్‌లో రెండు పంటలు కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరు? అక్కడ గోధుమలను పిండి పట్టి ఇస్తరా? పత్తిని బేల్స్ చేసి ఇస్తున్నారా? పప్పు పంటలను పప్పుచేసి ఇస్తేనే తీసుకుంటున్నారా? మరి మా వడ్లను మాత్రం బియ్యం చేసి ఇస్తేనే తీసుకొంటామని ఎందుకంటున్నరు? వాటి మాదిరిగానే వడ్లను కూడా వడ్లుగానే తీసుకోవాలి.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలులో రా రైస్, బాయిల్డ్ రైస్ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాత పాటే పాడారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్ర రైతులకు మోదీ సర్కారు క్షమాపణ చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని మండిపడ్డారు. ధాన్యం కొనాలని కోరితే.. పీయూష్ గోయల్ తెలంగాణ రైతులను అవమానించేలా, అహంకారపూరితంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నమే చేయలేదని, ఇది అత్యంత దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రితో భేటీ ముగిశాక మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కే కేశవరావు, నామానాగేశ్వర్‌రావు ఇతర ఎంపీలతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉన్నదని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని తెలిపారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, ఒక రాష్ట్రంగా సహకరించటమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
కేంద్రంలో వ్యవసాయ ఆత్మ లేని, వ్యాపార ధోరణి గల ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. మోదీ సర్కారుకు రైతులు, బడుగుల కష్టాలపై ఎలాంటి సానుభూతి లేదని ఆరోపించారు. చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి.. తెలంగాణ నుంచి రా రైస్ కొనుగోలు చేస్తామని వ్యాఖ్యానించడంపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎమ్మెస్పీ దేనికి ఇస్తున్నారు? ధాన్యానికా? బియ్యానికా? రా రైస్‌కు ఇస్తున్నమా? బాయిల్డ్ రైస్‌కు ఇస్తున్నమా?’ అని ప్రశ్నించారు. ఒప్పందంలో ‘ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ’ అనే ఉంటుందని, రైస్ అని ఉండదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేసి దాన్ని రా రైస్‌గా మార్చుకొంటారో, బాయిల్డ్ రైస్‌గా మార్చుకొంటారో కేంద్రం ఇష్టమని తేల్చి చెప్పారు. రైతాంగానికి దారి చూపాలని అడిగితే.. అది మాట్లాడకుండా ‘నాకు ఇంతకు మించి ఏం తెలియదు. ఇంతకు మించి నేనేం మాట్లడను’ అంటూ కేంద్ర మంత్రి సమస్యను దాటవేశారని తెలిపారు.తమతో సమావేశం ముగిసిన వెంటనే తమ కన్నా ముందు మీడియా సమావేశం పెట్టాల్సిన ఆత్రుత కేంద్ర మంత్రికి ఎందుకని ప్రశ్నించారు.
గోధుమలను పిండిగా మార్చి ఇస్తున్నారా?
పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలోనూ ధాన్యం సేకరించాలని కోరితే అలాగే చేస్తున్నామంటూ కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్కడ రెండు పంటలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. అక్కడ గోధుమలను పిండిలా మార్చి ఇస్తున్నరా? పత్తిని బేల్స్ చేసి ఇస్తున్నరా? పప్పు పంటలను పప్పు చేసి ఇస్తేనే తీసుకొంటున్నరా? అని ప్రశ్నించారు. వీటి మాదిరిగా వడ్లే తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసే మాదే రైతు వ్యతిరేక ప్రభుత్వమా?
తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమా? తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నదా? ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యాఖ్యలు ఉంటాయా? అని మండిపడ్డారు. కేంద్రం రైతుల కోసం ఏం చేయకున్నా.. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి సాగునీరు ఇచ్చినందుకు రైతు వ్యతిరేకులమా? అని ప్రశ్నించారు.రైతాంగాన్ని రోడ్లపైకి వచ్చేలా చేసి, ఆరేడు వందల మందిని పొట్టనబెట్టుకొన్న మీ ప్రభుత్వం రైతుపక్షపాతి ప్రభుత్వమా? అంటూ నిలదీశారు. తప్పు ఒప్పుకొని రైతులకు చేతులెత్తి క్షమాపణలు చెప్పిన సిగ్గులేని ప్రభుత్వం, సిగ్గులేని పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి చెందినవాళ్లు తెలంగాణ సర్కారు గురించి మాట్లాడుతరా? అంటూ ఫైరయ్యారు. సమస్యను పరిష్కరించాలని కోరితే ఉల్టా తెలంగాణ ప్రభుత్వం పైనే నిందలు వేస్తారా? అని దుయ్యబట్టారు.
మీ సన్నాసులే కదా వరి వేయాలని చెప్పింది
నిరుడు కేంద్రం పంట మార్పిడి చేయాలని కోరితే అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడిందని చెప్పారు. కానీ రాష్ట్ర బీజేపీ సన్నాసులే కదా.. ‘ఎంతైనా వరి వేయండి మేం కొనిపిస్తం, మేమే కొంటం. మధ్యలో కేసీఆర్ ఎవరు’ అని మాట్లాడింది అని నిలదీశారు. ఇప్పుడు ఆ మొనగాడు ఎక్కడికి పోయిండని, ఆ కేంద్రమంత్రి ఎక్కడికి పోయిండని ప్రశ్నించారు. తాము రైతులను వేడుకొంటే 20 లక్షల ఎకరాల్లో వరి తగ్గించారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నిరంకుశ వైఖరిపై సీఎం కేసీఆర్ సూచనతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ధాన్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం గురువారమే హైదరాబాద్‌కు చేరుకొన్నది.
1. గోధుమలను పిండిలా మార్చి ఇస్తున్నరా? పత్తిని బేల్స్ చేసి ఇస్తున్నరా? పప్పు పంటలను పప్పు చేసి ఇస్తేనే తీసుకొంటున్నరా? వాటిని ఎట్లా తీసుకొంటున్నారో అలా.. ధాన్యాన్నే తీసుకోవాలి.
2. ఎమ్మెస్పీ దేనికి ఇస్తున్నారు? ధాన్యానికా? బియ్యానికా? రా రైస్‌కు ఇస్తున్నమా? బాయిల్డ్ రైస్‌కు ఇస్తున్నమా? ఒప్పందంలోనూ ‘ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ’ అనే ఉంటుంది. రైస్ అని ఉండదు. ధాన్యం కొనుగోలు చేసి దాన్ని రా రైస్‌గా మార్చుకొంటారో, బాయిల్డ్ రైస్‌గా మార్చుకొంటారో కేంద్రం ఇష్టం.
3. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబందు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి సాగునీరు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేకమా? 13 నెలల పాటు దేశ రైతాంగాన్ని రోడ్లపైకి వచ్చేలా చేసి, ఆరేడు వందల మందిని పొట్టనబెట్టుకొన్న మీ(కేంద్రంలోని బీజేపీ) ప్రభుత్వం రైతుపక్షపాతి ప్రభుత్వమా? తప్పు ఒప్పుకొని రైతులకు చేతులెత్తి క్షమాపణలు చెప్పిన సిగ్గులేని ప్రభుత్వం, సిగ్గులేని పార్టీ బీజేపీ. ఆ పార్టీకి చెందినవాళ్లు తెలంగాణ సర్కారు గురించి మాట్లాడుతరా?
4. గత ఏడాది కేంద్రం పంట మార్పిడి చేయాలని కోరితే అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడింది. కానీ రాష్ట్ర బీజేపీ సన్నాసులే కదా.. ‘ఎంతైనా వరి వేయండి మేం కొనిపిస్తం, మేమే కొంటం. మధ్యలో కేసీఆర్ ఎవరు’ అని మాట్లాడింది. ఇప్పుడు ఆ మొనగాడు ఎక్కడికి పోయిండు, ఆ కేంద్రమంత్రి ఎక్కడికి పోయిండు.
అప్పుడు మోదీ అన్న మాటలే..
2013 సెప్టెంబర్ 9న గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ.. రైతు సదస్సు నిర్వహించి చాలా తెలివిగా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ఆ సమావేశంలో మోదీ.. ‘భారతదేశ వ్యవసాయ రంగం గురించి గొప్పగా ఆలోచించాలి. ఇక్కడి పంట ఉత్పత్తులను ఎగుమతి చేసేలా ఆలోచించాలి. కానీ మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి ఇది చేతకావటం లేదు. మేము వస్తే చాలా గొప్పగా చేస్తాం’ అని అన్నారు. కానీ ఇప్పుడు అవేమీ చేయటం లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏం అడుగుతున్నదో.. మోదీ ప్రధాని కావడానికి ముందు అదే మాట్లాడారని గుర్తు చేశారు. ఈ రోజు దేశంలో ఉత్పత్తి పెరిగింది కాబట్టి రైతులను వ్యవసాయం చేయొద్దని, పంట పండిచొద్దని చెప్తారా? అని నిలదీశారు.
‘బాయిల్డ్ రైస్ నై లేతే హమ్’
గదిలోకి వెళ్లీవెళ్లక ముందే మంత్రులతో గోయల్ అన్న మాట ఇది.
మొన్నటికి మొన్న డిసెంబర్ 21న
“ఎందుకు ఊరికే ఢిల్లీకి వస్తారు?”
మీకేం పనిలేదా అని మంత్రులను తూలనాడిన గోయల్ ఈసారి అంతకంటే దూకుడుగా వ్యవహరించారు. కిషన్‌రెడ్డి కోసం మంత్రులను వెయిటింగ్లో ఉంచారు.
అదే వ్యంగ్యం.. అదే హేళన.. అదే నిర్లక్ష్యం.. అదే అహంకారం.. అదే మొండితనం.. అదే పిడివాదం.. రైతు శ్రేయస్సు కన్నా రాజకీయమే ముఖ్యం.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరోసారి తెలంగాణను అవమానించారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న తెలంగాణ రైతన్నల ఆశలపై నీళ్లు చల్లారు.
దశాబ్దాల అరిగోస తర్వాత ఇప్పుడిప్పుడే సన్నబువ్వ తింటున్న తెలంగాణ నిరుపేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.
తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య..వడ్ల కొనుగోలు పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని మరోసారి అవమానించారు.
తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయండి. సమస్య ఆటోమెటిక్‌గా పరిష్కారం అయిపోతుంది.
యాసంగి వడ్లు కొనాలని మంత్రులు డిమాండ్ చేస్తే పీయూష్ గోయల్ ఇచ్చిన ఉచిత సలహా ఇది. అంతేకాదు..
‘షాపులో ఏది అమ్ముడుపోతే మేం అదే కొంటాం’
అని పక్కా ప్రైవేటు వ్యాపారిలా మాట్లాడారు.