హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో వ్యవసాయ శాఖ(Secretariat)పై తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ విలువైనా సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలలో సాగు అంచనా వేస్తున్నామన్నారు. మరో 14 లక్షల ఎకరాలలో ఉద్యాన(Horticulture) పంటల సాగుకు అవకాశముందని వెల్లడించారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సమాయత్తం కావాలని సూచించారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
నానో యూరియా(Nano Urea), నానో డీఎపీ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ అవసరాలలో డ్రోన్(Drone) వినియోగంపై యువతకు అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని చెప్పారు.
వరి సీజన్‌ను ముందుకు జరపాలి
బాన్సువాడ, బోధన్, హుజూర్ నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి(Paddy) సాగు సీజన్ ముందుకు జరపాలని అధికారులకు మంత్రి వివరించారు.మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని సూచించారు.తక్కువ కాలంలో అధిక దిగుబడులు ఇచ్చే నూతన వరి వంగడాలను రైతులకు అందేలా చూడాలన్నారు.
నకిలీ విత్తన పంపిణీ దారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కొండబాల కోటేశ్వర్ రావు, మార గంగారెడ్డి, కొండూరు రవీందర్ రావు, సాయిచంద్, తిప్పన విజయసింహారెడ్డి, మచ్చా శ్రీనివాస్ రావు, రాజావరప్రసాద్ రావు, రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.