Mahmood Ali | మాదాపూర్ : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డేను పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన హైబిజ్ టీవి మీడియా అవార్డ్స్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహరెడ్డి, భారతి సిమెంట్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, క్రెడాయ్ రాజశేఖర్‌రెడ్డి, పౌల్ట్రీ ఇండియా చక్రధర్రావులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 42 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని, అనారోగ్య కారణంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబానికి రూ. 1 లక్ష అందించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని అవరోధాలు వచ్చిన వెనకడుగు వేయకుండా కష్టించి పనిచేస్తున్న జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో జర్నలిస్టులు ఒకరికొకరు పోటీ పడుతూ, వార్తలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నారని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పటి జర్నలిజం, పాలిటిక్స్‌కు ఇప్పుడున్న జర్నలిజం, పాలిటిక్స్‌కు ఎంతో తేడా ఉందన్నారు. మొదట దూరదర్శన్ నుండి మొదలై ఇప్పుడు అనేక చానల్స్, పత్రికలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. సమాజాన్ని చైతన్య పరచడంలో మీడియా జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని చెప్పారు. సత్యానికి దూరం ఉండకుండా నిజాలను మాత్రమే ప్రజలకు తెలియజెప్పాలని అన్నారు.
అనంతరం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్సులో భాగంగా ఆయా కేటగిరీల్లో 65 మందికి అవార్డులను అందజేశారు. బెస్ట్ ప్రింట్ జర్నలిస్టుగా నమస్తే తెలంగాణలో పనిచేస్తున్న గుండాల కృష్ణ, బెస్ట్ కార్టునిస్ట్గా మృత్యుంజయ్, బెస్ట్ ఫోటోగ్రాఫర్‌గా గోపి బందిగే, బెస్ట్ ప్రింట్ అడ్వర్టెయిజ్మెంట్లో నమస్తే తెలంగాణ రాజిరెడ్డి, సీనియర్ ఎంప్లాయి రాములుకు మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.