లండన్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఇటీవల లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా యూకేలోని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే ప్రెసిడెంట్ రత్నాకర్ ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. అయితే మంత్రి కేటీఆర్ తమ ఇంటికి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎన్ఆర్ఐ రత్నాకర్ తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. దేవుడు తమ ప్రార్థనలు ఆలకిస్తే, ఆ దయామయుడు కరుణిస్తాడని, అలాంటి వేళ జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయని ఎన్ఆర్ఐ రత్నాకర్ తన వీడియోకు కామెంట్ చేశారు.
ప్రేమపూర్వక సోదరుడు, మంత్రి, డైనమిక్ నేత కేటీఆర్.. లండన్‌లోని తమ ఇంటికి వచ్చినట్లు రత్నాకర్ ఆ వీడియోలో తెలిపారు. ఎన్ఆర్ఐ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. రత్నాకర్ ఫ్యామిలీతో చాలా సమయాన్ని గడిపారు. రత్నాకర్ కుమారుడు రణవ్ను ఎత్తుకు ఆడించారు. ఆ పిల్లవాడిని భుజంపై వేసుకుని మంత్రి కేటీఆర్ నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. తమ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆశీర్వదించారని ఎన్ఆర్ఐ తన ట్వీట్లో తెలిపారు.
తమ కుటుంబానికి అలౌకికమైన ఆనందాన్ని కలిగించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు తనకు మాటలు చాలడం లేదని కూడా ఎన్ఆర్ఐ తన ట్వీట్లో వెల్లడించారు. బాస్, లీడర్, బ్రదర్ లవ్ హ్యాష్‌ట్యాగ్‌లతో మంత్రి కేటీఆర్‌పై ఆ ఎన్ఆర్ఐ తనలో దాగిన ప్రేమను చాటుకుంటూ అమితమైన రీతిలో థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఆ వీడియోను ఇవాళ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఎన్ఆర్ఐ చూపిన అభిమానం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. స్మైలింగ్ ఎమోజీని పోస్టు చేశారు.
It was a pleasure 😊 https://t.co/BF8yEYfuIw
— KTR (@KTRBRS) May 16, 2023