తెలంగాణలో ఇన్నోవేషన్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై 9 ఏండ్లుగా ప్రభుత్వం పని చేస్తున్నది. పారదర్శకంగా, వేగంగా పరిశ్రమల స్థాపనకు అనుమతులిచ్చే సింగిల్‌విండో విధానం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చింది. పరిశ్రమల రాకకు బాటలు వేసింది. ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్న లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్‌నకు ధన్యవాదాలు.
– మంత్రి కేటీఆర్
లండన్ స్టాక్ ఎక్స్చేంజీ వివరాలు
ప్రాంతం: లండన్
ప్రారంభం: 30, డిసెంబర్ 1801
యాజమాని:లండన్ స్టాక్ ఎక్స్చేంజీ గ్రూప్
కీలక వ్యక్తులు: డాన్ రాబర్ట్ (చైర్మన్),
డేవిడ్ స్కావిమ్మర్ (సీఈవో)
లిస్టింగ్ సంస్థలు: 1,918
మార్కెట్ క్యాప్: 3.57 ట్రిలియన్ డాలర్లు (మార్చి 2022 నాటికి)
Excellence center | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చేపట్టిన మంత్రి కేటీఆర్ యూ కే పర్యటన విజయవంతంగా ప్రారంభమైం ది. హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకొచ్చింది. ఇందులో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలిస్తామని సంస్థ తెలిపింది. మంత్రి కేటీఆర్ – లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఐవో ఆంథోనీ మెక్ కార్తీతో లండన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆంథోనీ మెక్ కార్తీ పరస్పరం మార్చుకొన్నారు. ఈ సెంటర్ ద్వారా హైదరాబాద్‌లోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు భారీ ఊతం లభించనున్నది.
తెలంగాణ ప్రభుత్వ నిరంతర కృషితో వ్యవసాయం, ఐటీ నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమైందని చెప్పారు. లండన్‌లోని భారత హై కమిషనర్ విక్రం కే దురైస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్’ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులు, ఇతరులకు వివరించారు. తెలంగాణలో ఇన్నోవేషన్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై 9 సంవత్సరాలుగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతుల విధానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చే ఈ విధానం అద్భుత ఫలితాలిచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌లో టెక్ కంపెనీల పెరుగుదలతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్టైల్స్ వంటి రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూకేలోని కింగ్స్‌కాలేజ్, క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో చేసుకొన్న భాగస్వామ్యాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని కంపెనీలకు పిలుపునిచ్చారు.
పెట్టుబడులకు తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త కరెంట్ బిల్లిమోరియా ప్రస్తావించారు. ఏవియేషన్, డిఫెన్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో యూకే కంపెనీలతో భాగస్వామ్యానికి గల అవకాశాలను విక్రమ్ కే దురైస్వామి వివరించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు అద్భుత గమ్యస్థానమని అన్నారు. నూతన సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల విగ్రహం వంటివాటిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో జయేశ్ రంజన్, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
లండన్ స్టాక్ ఎక్స్చేంజీకి ఘనమైన చరిత్ర ఉన్నది. పురాతన ఎక్స్చేంజీల్లో ఇది ఒకటి. యూరప్‌లో ఇది అత్యంత విలువైన స్టాక్ ఎక్స్చేంజ్. బ్రిటన్ జనాభాలో 15 శాతం మంది ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టారు. లండన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కస్టమర్లకు సేవలు అందిస్తున్నది. 17వ శతాబ్దంలో బ్రిటన్‌లో రాయల్ ఎక్చ్చేంజి ఒక్కటే ఉండేది. దీంట్లో అక్కడి స్టాక్ బ్రోకర్లు లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి లేకపోవడంతో చిన్న స్థాయి ఇన్వెస్టర్లు కలిసి ఒక కాఫీ హౌజ్‌లో దీనిని ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజి యూరప్‌లో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజీల్లో ఒకటిగా ఎదిగింది.