హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కొవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెలంగాణకు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ ‘కార్బివాక్స్’ అనే కొవిడ్ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ కంపెనీ 2022, ఫిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది.
After Bharat Biotech’s CoVaxin now another Covid vaccine from #Telangana based company Biological E with CorbeVax 👍
— KTR (@KTRTRS) December 29, 2021
My compliments to Mahima Datla Garu & her team 👏
Biological E aims to produce 100 million doses/month of Corbevax from February 2022 https://t.co/YwEkJQWxbY
ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేసే క్రమంలో కేంద్రం కీలక ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా ‘కార్బివాక్స్’కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అభివృద్ధి చేసిన ‘కొవొవాక్స్’ టీకాకు, అమెరికా ఫార్మాసంస్థ మెర్క్ తయారుచేసిన ‘మోల్నుపిరవిర్’ యాంటీ-వైరల్ గోలీకి అనుమతిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు చెందిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ అనుమతులనిచ్చినట్టు డీసీజీఐ తెలిపింది.
కార్బివాక్స్: రిసెప్టార్ బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ) ప్రొటీన్ సబ్ యూనిట్ ఆధారంగా భారత్‌లో అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లోని గ్లైకోప్రొటీన్లో ఉన్న కీలకమైన ఆర్బీడీ ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్ ఈ’ ఈ టీకాను తయారుచేసింది. ఇది రెండు డోసుల టీకా. 28 రోజుల ఎడంతో ఇవ్వాలి. కార్బివాక్స్‌ను బూస్టర్ డోసుగా వినియోగించడంపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు బయలాజికల్ ఈ సంస్థకు డీసీజీఐ అనుమతినిచ్చినట్టు సమాచారం.