హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): దేశంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్ నుంచే ఉన్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో థ్రిల్ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధులు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని 2014లోనే చెప్పామని, అన్నట్టుగానే 8 ఏండ్లుగా పరిశ్రమ అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. స్టార్టప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంను మరింత అభివృద్ధి చేశామని వెల్లడించారు. శాంతి భద్రతలకు పెద్ద పీట వేశామని వివరించారు. నాస్కామ్ నివేదిక ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వస్తే, అందులో 1.5 లక్షల మంది హైదరాబాద్ నుంచే ఉన్నారని చెప్పారు.
అదే సమయంలో బెంగళూరులో 1.46లక్షల మందికే ఐటీ ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఐటీ ఉద్యోగులు 3.23 లక్షలు ఉండగా, ప్రస్తుతం 8.7 లక్షల మంది ఉన్నారు. 2014లో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉంటే, 8 ఏండ్లలో రూ.1.83 లక్షల కోట్లకు చేరింది. 8 ఏండ్ల కిందట ప్రారంభించిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్) సెంటర్ ద్వారా 7 లక్షల మందికి పైగా యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాం. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ శిక్షణ ఇచ్చాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ టీ-హబ్, మహిళల కోసం వీ-హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, శానిటేషన్ హబ్ కూడా ఏర్పాటు చేశాం. త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీ-వర్స్ ప్రారంభం కానున్నది’ అని మంత్రి తెలిపారు.
పది లక్షల గృహాలకు ఇంటర్నెట్
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల గృహాలకు ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా టీ-ఫైబర్ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టామని, అది ఈ సంవత్సరం పూర్తవుతుందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో 3,000కు పైగా వైఫై హాట్ స్పాట్ల ద్వారా విజయవంతంగా ఇంటర్నెట్ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మీ-సేవ కేంద్రాలు దేశంలోనే అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయని, పెన్షన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల పునరుద్ధరణ, ఈ-ఓటింగ్ వంటి అనేక సేవల్లో టెక్నాలజీలను తెలంగాణ సర్కారు వాడుతున్నదని వివరించారు.
హైదరాబాద్‌లో మెరుగైన మౌలిక వసతులు
‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం. 8 ఏండ్లుగా అత్యధికంగా మౌలిక వసతులు కల్పించిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేశాం. సంపూర్ణ మురుగునీటి శుద్ధి వంద శాతం చేసే మరో ప్రాజెక్టును చేపట్టాం. ఇంతటి ఘనత దేశంలో మరే ఇతర నగరానికి లేదు’ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
2050 నాటికి హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతులను చేపడుతున్నామని చెప్పారు. నగరంలో 300 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మించేందుకు జిహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నదని తెలిపారు. మెట్రో మార్గాన్ని ఎయిర్‌పోర్టు వరకు, ఐటీ పరిశ్రమలను నగరంలోని ఇతర ప్రాంతాలకు, జిల్లా కేంద్రాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని వివరించారు. ‘పలు జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ టవర్లను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటీ కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి.
వరంగల్‌లో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు విజయవంతంగా నడుస్తున్నాయి’ అని పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలతో కలిసి ఐటీ కంపెనీలు పని చేయాలని ప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైసియా అధ్యక్షురాలు మనీషా సాబూ, ఐటీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతరిక్ష పరిశోధనల్లో అగ్రస్థానం
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన సార్టప్‌లు స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ వంటి స్టార్టప్‌లు అంతరిక్ష రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సైతం మూడు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయింది. కానీ, టీ-హబ్ కేంద్రంగా ప్రారంభమైన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా కక్ష్యలో రాకెట్‌ను ప్రవేశపెట్టింది’ అని గుర్తుచేశారు. ధ్రువ స్టార్టప్ కూడా నానో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ప్రస్తావించారు. దేశంలోనే ఇన్నోవేషన్ సిస్టం అత్యంత పటిష్ఠంగా ఉన్నది హైదరాబాద్‌లోనేనని పేర్కొన్నారు.
ప్రీమియర్ స్టార్టప్ ఇంక్యుబెటర్.. టీహబ్: జెన్నిఫర్ లార్సన్
టీహబ్ భారతదేశంలోని ప్రీమియర్ స్టార్టప్ ఇంక్యుబెటర్ అని జెన్నిఫిర్ లార్సన్ ప్రశంసించారు. సోమవారం భారత అమెరికా రాయబారి బెత్ జోన్స్‌తో కలిసి ఆమె టీహబ్‌ను సందర్శించారు. అక్కడ యువ ఆంత్రప్రెన్యూర్స్‌ను స్వయంగా కలిసి మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ తరహా ఐటీ రంగ పురోగతిని మరెక్కడా చూడలేదని, ఇక్కడ వివిధ రంగాల్లో పురోగతికి అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. అమెరికన్ కాన్సులేట్ కొత్త భయం ఆసియాలోనే అతి పెద్దదని, ఇది హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ కృషితోనే ఇంత అద్భుతమైన భవనం రూపుదిద్దుకొన్నదని శ్లాఘించారు. అనంతరం బెత్ జోన్స్‌కు మంత్రి కేటీఆర్ జ్ఞాపికను బహుకరించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘హైదరాబాద్ పర్యటనలో భాగంగా టీహబ్‌ను సందర్శించానని, ఇది హైదరాబాద్ ఆర్థిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది’ అని లార్సన్ ట్విట్టర్లో కొనియాడారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.