జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోసం చేసిన మోదీ ఒక దిక్కు.. 15 లక్షల మంది పిల్లలు మహబూబ్‌నగర్ నుంచి వలసపోకుండా ఆపిన కేసీఆర్ మరో దిక్కు.. మీరు ఏ దిక్కున ఉంటారో తేల్చుకోండి. ఇదే మైదానంలో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోదీ చెప్పి ఇచ్చిండా? కనీసం కృష్ణా నదిలో మన వాటా తేల్చిండా? రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200 చేసిన బీజేపీని బండకేసి కొట్టాల్నా లేదా? జాడిచ్చి తన్నాల్నా లేదా?
– పాలమూరు సభలో మంత్రి కేటీఆర్
KTR | మహబూబ్‌నగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పారిశ్రామికవేత్తలు వచ్చి తెలంగాణలో ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘ఇది పోటీ ప్రపంచం.. ఇతర దేశాలతో పోటీ పడి మెప్పించి.. ఒప్పించి పరిశ్రమలను రప్పిస్తున్నాం.. దేశ విదేశాలతో పోటీపడి మరీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం’ అని పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఐటీ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం అమరరాజా గిగా బ్యాటరీ కారిడార్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అమరరాజా వ్యవస్థాపకుడు రామచంద్రనాయుడు, ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరరాజా స్థాపించే గిగా లిథియం బ్యాటరీ పరిశ్రమ త్రీడి చిత్రాలను వీక్షించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎలాంటి అవినీతి లేకుండా ఒక పరిశ్రమ తీసుకురావాలంటే ఇతర దేశాలతో ఎంతో పోటీ పడాల్సి వస్తుందని తెలిపారు. ‘అమరరాజా బ్యాటరీ పరిశ్రమను ఎక్కడైనా పెట్టొచ్చు.. వాళ్లకు చాయిస్ ఉన్నది.. అయినా తెలంగాణలో పెట్టారు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారని తెలియగానే దాదాపు 8 రాష్ర్టాలు తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించినట్టు గల్లా అరుణకుమారి చెప్పారు. రాష్ర్టాలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశవిదేశాల్లో పెట్టబడులను ఆకర్షించడానికి చేయని ప్రయత్నం లేదు’ అని వివరించారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే ఆరోజు బిజినెస్ ఏమీ నడువదని నిర్ణయానికి వచ్చేవాళ్లు. అప్పట్లో మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయాలని, చేస్తే ఏమొస్తది అని మాతో చాలాసార్లు వాదించారు. నాడు మేము ఒక్కటే చెప్పాం.. అక్కా! నేడు బాధ అనిపించవచ్చు కానీ.. రెండు రాష్ర్టాలుగా విడిపోయినా ప్రజలు కలిసే ఉన్నారని, రెండు రాష్ర్టాలు అభివృద్ధి చెందాయని పదేండ్ల తర్వాత మీరే అంటారు అని చెప్పినం.. నేడు అది నిజమైంది’ అని కేటీఆర్ అన్నారు.
ఏ రాష్ట్రంలో అయినా ప్రైవేటు రంగంలో భాగస్వామ్యం కుదుర్చుకొని పరిశ్రమలు స్థాపిస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘మేం ఎంతో కష్టపడి పరిశ్రమలు తెస్తున్నాం.. కానీ, కొందరు అడ్డుకొంటున్నారు. ప్రగతి నిరోధకులు ప్రతీచోటా ఉంటారు. నాడు దేవుళ్లకే తప్పలేదు.. రాక్షసులతో యుద్ధం. ఇక్కడ పరిశ్రమ పెడితే కాలుష్యం వస్తుందని చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు. వీళ్లు అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇక్కడ తయారయ్యే బ్యాటరీలన్నీ లిథియం బ్యాటరీలే.. జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌తో.. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తారు. ఇప్పటికే పరిశ్రమలు పెట్టిన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చుక్క కాలుష్యం లేదు. ఇంకా అనుమానం ఉంటే పది బస్సులు పెట్టి పంపండి.. అక్కడ చుట్టు పక్కల ప్రాంతాలు ఎంత గొప్పగా మారాయో చూసి వస్తారు’ అని పేర్కొన్నారు. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని తెలిపారు. 16 గిగావాట్ల సామర్థ్యంతో అమరరాజా పరిశ్రమ పెడుతున్నదని, ఒక గిగావాట్‌తో 5 లక్షల ద్విచక్ర వాహనాలకు, 35 వేల కార్లకు బ్యాటరీలు అందించవచ్చని వివరించారు.
ఈ లెక్కన ఎన్ని వాహనాలకు బ్యాటరీలు అందుతాయో ఉహించవచ్చని తెలిపారు. ఇక్కడ అమరరాజా దశలవారీగా పదేండ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతుండగానే స్థానికులకు అర్హతకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌కు కుడిపక్కన కరివెన రిజర్వాయర్, ఎడుమ పక్కన ఉద్ధండాపూర్ రిజర్వాయర్‌ను 33 టీఎంసీల నీటితో నింపుతున్నట్టు చెప్పారు. జాతీయ రహదారి, రైల్వేస్టేషన్ అందుబాటులో ఉండటమే కాకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు గంట ప్రయాణ దూరంలో ఉన్న దివిటిపల్లి ఐటీ కారిడార్ భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందడం ఖాయమని తెలిపారు. అనవసరంగా చిల్లర మాటలు మాట్లడే వారు మనసు మార్చుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కేటీఆర్ హితవు పలికారు.
ఈ కార్యక్రమాల్లో అమరరాజా కో ఫౌండర్ గల్లా అరుణకుమారి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణమ్మ, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహగౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, చల్లా వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దివిటిపల్లి ఐటీ కారిడార్ ప్రారంభోత్సవం మరిచిపోలేని రోజు అని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గతంలో పాలమూరు అంటే లేబర్‌కు కేరాఫ్‌గా ఉండేదని, వెనుకబడ్డ జిల్లాలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ను అడిగిన వెంటనే ఐటీ కారిడార్‌ను మంజూరు చేశారని తెలిపారు. అన్ని జిల్లాల్లో నాలుగైదు ఎకరాలు ఇస్తుంటే.. పాలమూరు జిల్లాలో నాలుగు వందల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఐటీ కారిడార్‌లో ఎనిమిది కంపెనీలు ఎంవోయూ కుదర్చుకున్నాయని.. ఇందులో అమెరికా కంపెనీ కూడా ఉన్నదని వివరించారు.