హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆ రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ గురించి తమవద్ద నిర్దిష్ట సమాచారం ఉన్నదని చెప్పారు. ఎన్నికల అనంతరం ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని అన్నారు. హుజూరాబాద్‌లో నూటికి నూరుశాతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుస్తున్నాడని కేటీఆర్ స్పష్టంచేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గట్టి అక్రమార్కుడు కావటం వల్ల మంచోడైన భట్టి విక్రమార్క మాటలు కాంగ్రెస్‌లో పారటం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని పెట్టడంవెనుక రహస్యమేంది?
బీజేపీతో కుమ్మక్కవడం వల్లే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని పోటీలో నిలిపిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి ముక్కుముఖం కూడా తెలియవని పేర్కొన్నారు. ‘అనామకుడిని తీసుకొచ్చి ఏ ఎజెండాతో నిలబెట్టారు? మాకున్న సమాచారం మేరకు ఇదంతా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో భాగం. గతంలో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే మోడల్ ఇప్పుడు హుజూరాబాద్‌లో రిపీట్ చేస్తున్నారు. రాజేందర్‌కు సహకరించి ఏడాదిన్నర తరువాత ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వివేక్ కూడా ఉన్నరు అంటున్నరు. మేంకూడా వారి ఎత్తులను చిత్తుచేస్తాం’ అని స్పష్టంచేశారు.
జై బీజేపీ అంటే ప్రజుల తోలు తీస్తారనే..
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈటలకు ఓటేస్తే ఏమొస్తదని ప్రశ్నించారు. ‘ఈటలా.. నీ శ్రీరాం ఏడపాయే? జై మోదీ, జై బీజేపీ ఏడపాయే? ఎందుకు అనటం లేదు? జై బీజేపీ అంటే జనం తోలు తీస్తరని భయమా? రైతులను కార్లతో తొక్కించే దృశ్యం గుర్తుకొస్తదని భయమా? ఏల్పీజీ సిలిండర్, పెట్రోల్ ధరలు గుర్తుకొస్తయని భయమా?’ అని నిలదీశారు. మంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నల్లచట్టాలన్న ఈటలకు, బీజేపీలో చేరగానే అవి తెల్లచట్టాలు అయ్యాయా? అని ప్రశ్నించారు. ‘నాకేదో అన్యాయం జరిగిందని ఈటల రాజేందర్ చెప్పుకుంటూ తిరుగుతున్నడు. 17 ఏండ్లు టీఆర్ఎస్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్టీ ఎల్పీ లీడర్‌గా పదవిలోనే ఉన్నడు. మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అవహేళన చేసిండు. రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలను పరిగ ఏరుకోవటమన్నడు. అనేక తప్పులు చేసినా కేసీఆర్ భరించారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే ప్రజలకేం వస్తదో చెప్పాలి? ఎల్పీజీ ధరలు తగ్గిస్తారా? కేంద్రాన్ని ఒప్పించి బీసీ బంధు తెస్తారా? ఈటలకు ఓటు ఎందుకు వేయాలి? అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో గండరగండడైన జానారెడ్డిపై రాజకీయాల్లో బొడ్డూడని పిల్లగాడు నోముల భగత్ 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడని, జానారెడ్డికంటే ఈటల పెద్దనాయకుడా అని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఉన్నాయన్న నెపంతో దళితుల జీవితాలను మార్చేసే దళితబంధు పథకాన్ని ఆపించారని, ఇలా ఎంతకాలం ఆపుతారని ప్రశ్నించారు. ఎన్నికల తరువాత ఈ పథకం ఆగదని స్పష్టంచేశారు.
చాలెంజ్‌లు ఏమాయె?
గతంలో పలు ఎన్నికల సందర్భంగా చాలెంజ్‌లు చేసిన నేతలు ఇప్పుడు ఏమయ్యారో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఒకాయన కొడంగల్‌లో నన్ను ఓడగొడితే సన్యాసం తీసుకుంట అన్నడు. ఇంకా సన్నాసి లెక్క తిరుగుతున్నడు. రాజకీయాల్లో చాలెంజ్‌లకు అర్థమే లేకుండా పోయింది. అప్పట్లో అదే మనిషి ఇంకో డైలాగ్ కొట్టిండు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలిస్తే చెవి కోసుకుంట అన్నడు. ఎవరూ ఏమీ కోసుకోవద్దు అని చెప్పినం’ అని కేటీఆర్ గుర్తుచేశారు.