
హైదరాబాద్ : పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపుతామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన పోడు భూముల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హక్కు పత్రాల పేరిట అక్రమాలకు పాల్పడితే చర్యలుంటాయన్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని.. అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టే చేస్తామని.. హరితహారంలో మూడేళ్లలో 4.5శాతం పచ్చదనం పెరిగిందని గుర్తు చేశారు. అటవీ ఆక్రమణలు జరుగకూడదనే హక్కుపత్రాలు అందిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేయాలని, అవసరమైతే వీడియో చిత్రీకరణ చేయాలని సూచించారు. అధికారులు తప్పులు చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అటవీ భూములపై అధికారులు కోర్టుల్లోనూ పోరాడాలని.. అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
