హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ రంగాల్లో 1,000కిపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లతో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నదన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కంపెనీలకు హామీ ఇచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) సంయుక్తంగా ఢిల్లీలో సోమవారం నిర్వహించిన రక్షణ రంగ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో రక్షణ రంగ తయారీలో ఉన్న అవకాశాలను వివరించారు. దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఎకో సిస్టం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. గడిచిన ఏడేండ్లలో ఈ వ్యవస్థ భారీగా విస్తరించిందని, డిఫెన్స్-ఏరోస్పేస్ రంగాల్లో స్థానికంగా సుమారు 1,000కిపైగా ఎంఎస్ఎంఈలు పనిచేస్తున్నాయని తెలియజేశారు.
మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్
హైదరాబాద్ నగరం మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తెలంగాణలో విస్తరించిన డిఫెన్స్ పరిశోధన-అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. డీఆర్డీవో, బీఈఎల్, హెచ్ఏఎల్ వంటి అనేక ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు ఇక్కడే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలను ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించినట్టు చెప్పారు. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు సాధించేందుకు అవసరమైన పాలనాపరమైన సంసరణలను చేపట్టినట్టు వివరించారు. ఈ క్రమంలోనే టీఎస్ఐపాస్ విధానం, ప్రపంచ శ్రేణి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, 24 గంటల పారిశ్రామిక విద్యుత్తు సదుపాయాలను పరిగణనలో పెట్టుకొని పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవాలని డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
మానవ వనరుల్లోనూ దిట్ట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఆఫ్ సిల్ అండ్ నాలెడ్జ్-టాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. దీంతోపాటు ప్రపంచ స్థాయి క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ వంటి వాటితో సైతం తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకున్నదని పేర్కొన్నారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్స్ వల్ల హైదరాబాద్లో ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతమైందన్నారు.
ఈ క్రమంలోనే బోయింగ్ కంపెనీ ఇన్నోవేషన్ కార్యక్రమాలు, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఐడీఈఎక్స్ (ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్లెన్స్) వంటి ఇంక్యుబేషన్ కార్యక్రమాలను కూడా చేపడుతున్నామన్నారు. ఆదిభట్ల, నాదర్గుల్, జీఎమ్మార్ ఏరోస్పేస్, హార్డ్వేర్ పార్, ఈ-సిటీ, ఇబ్రహీంపట్నంలో పారిశ్రామిక పార్ వంటి ప్రత్యేక ఇండస్ట్రియల్ పారులు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ఓఎస్డీ సంజయ్ జాజు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ఏరోస్పేస్, డిఫెన్స్ దిగ్గజ సంస్థలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ తదితర అనేక దేశాలకు చెందిన ప్రముఖ ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్) కంపెనీలు ఇంతలా పెట్టుబడులు పెట్టిన నగరం ప్రపంచంలోనే ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రఖ్యాత డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థలైన లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాయి’
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి