వెల్గటూర్, జనవరి 31: ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాన్ని, ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆ పార్టీ పన్నాగం పన్నుతున్నదని చెప్పారు. ఆ పార్టీ ఆటలు ఇక సాగవని, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గుల్లకోటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ తరహాలో అభివృద్ధి దేశమం తటా జరగాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కేరళ సమావేశంలో తీర్మానం చేస్తున్నాయని, అలాంటిది.. బీజేపీలో ఉన్న బండి సంజయ్ లాంటి నాయకులు తొండి మాటలు చెప్పి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మీద, రైతుల మీద కక్షగట్టి వడ్లు కొనబోమని రోడ్డెక్కేలా చేస్తున్నారని తెలిపారు. ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యతే అయినా, అబద్ధపు మాటలు చెప్పి రైతులను ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ కునమల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.