హైదరాబాద్: నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై ఆమె మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారు. మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. మీ మనోభావాలు దెబ్బతీయాలని తన ఉద్దేశం కాదని తెలిపారు. స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు తనకు ఆదర్శమని పేర్కొన్నారు. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాని పేర్కొన్నారు. అన్యదా భావించకూడదని ఎక్స్ వేదికగా నటి సమంతకు మంత్రి సురేఖ ట్వీట్ చేశారు.
‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.’ అంటూ సురేఖ ట్వీట్ చేశారు.
నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు.
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..
— Konda surekha (@iamkondasurekha) October 2, 2024
కాగా, మంత్రి తీరుపై సమంత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేసిన సమంత.. మంత్రి సురేఖను సున్నితంగా మందలించారు. సమాజంలో నిలబడి పోరాడటానికి ఎంతో ధైర్మం, బలం కావాలని, దయచేసి తనను చిన్నచూపు చూడొద్దంటూ ఒకింత హెచ్చరించినంత పనిచేశారు. ఓ మంత్రి మాటలకు విలువ ఉంటుందని గ్రహించాలని చురక అంటించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలంటూ హుందాగా హితవు చెప్పారు. విడాకులు తన వ్యక్తిగత విషయమని, దయచేసి దానిపై ఊహాగానాలు మానుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు. తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడం అంటే ఇతరులు వాటిని తప్పుగా ప్రచారం చేయడం కాదని ఉద్బోధించారు. సమంత విడుదల చేసిన ప్రకటన పూర్తిపాఠం ఇలా ఉంది.
‘మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, గ్లామర్ పరిశ్రమంలో నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్నచూపు చూడకండి. మంత్రిగా మీ మాటలకు ఎంతో ప్రాధాన్యముంటుందని మీరు గ్రహించారని భావిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల గుర్తించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నా. నా విడాకులు నా వ్యక్తిగత అంశం. దానిపై ఊహాగానాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచాలని అనుకోవడం అంటే ఇతరులు దానిపై తమ ఇష్టం వచ్చినరీతిగా మాట్లాడాలని కాదు. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూరక్వంగా జరగాయని స్పష్టం చేస్తున్నా. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. మీ రాజకీయ వివాదాల నుంచి నా పేరు ను దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.