Minister Jagadish Reddy | ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో.. గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడియాడుతారని నమ్మే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మహిళలు అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని, వారికి కావాల్సింది ప్రోత్సాహం అన్నారు. అందుకే అన్ని రంగాల్లో మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్, రాజకీయ రంగాల్లో రాణిస్తున్న మహిళామణులను సత్కరించారు. మహిళా దినోత్సవం కానుకగా జిల్లాలో ఉన్న 14,201 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.750కోట్ల చెక్‌ను మంత్రి అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డలకు అండ కేసీఆర్ ఉన్నారని, మహిళా హక్కులు, రక్షణ విషయంలో భారత దేశానికే తెలంగాణ నమూనాగా మారిందన్నారు. కల్యాణలక్ష్మితో ఆర్థిక భరోసాతో పాటు బాల్య వివాహాలకు చెక్ పెట్టిన మహిళా రక్షకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ నిర్ణయంతో వచ్చిన షీ టీమ్స్‌తో అద్బుతం ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ప్రతి పథకానికి మహిళా పేరు నామకరణం చేయడమే మహిళల పట్ల కేసీఆర్‌కు ఉన్న ఆదరాభిమానాలకు నిదర్శనమన్నారు. మహిళలు ఆర్థికంగా బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని నమ్మే నాయకుడు కేసీఆర్ అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని అన్నారు.
ఆడపిల్లలు తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. మహిళలను కడుపులో పెట్టుకుంటున్న కేసీఆర్‌ను మహిళలు మనసులో పెట్టుకుని అవసరమైన సందర్బంలో అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి వేలాదిగా తరలివచ్చిన మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్య మహిళ పోస్టర్స్‌ను మంత్రి విడుదల చేశారు.