సూర్యాపేట: రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ (PM Modi) దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్పై (CM KCR) కుట్రలో భాగమే కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సూర్యాపేటలో తన నివాసంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. బీజేపీ (BJP) అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఆప్ (AAP), ఇక్కడ బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టె కుట్రలో భాగగానే నోటీలు, అరెస్టులని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తున్నదని, ఇలాంటి పప్పులు సీఎం ముందు ఉడకవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను నిలువరించగలం అనుకుంటున్న వారిది మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు.