సూర్యాపేట, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పాలన, అభివృద్ధిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజన్‌కు బీజేపీ వంద మైళ్లు వెనుకబడి ఉన్నదని.. అందుకోవడం కూడా కష్టమేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.కోటి విలువైన మూడు చక్రాల స్కూటీలు, ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, 4జీ ఫోన్లను దివ్యాంగులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తమదేనని ఉద్ఘాటించారు. ఏకధాటిగా 25 ఏండ్లు బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్లో తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేశారా అని ప్రశ్నించారు. కనీసం ఇంటింటికీ మంచినీరు అందించలేని వారు దేశాన్ని ఏం అభివృద్ధి చేస్తారని నిలదీశారు. మోదీ ఏలుబడిలో సంక్షేమం ఉండదని, అభివృద్ధి జరగదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో ఒకరిద్దరు దళారులకు మాత్రమే ఫలితం దక్కిందని పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు ఢిల్లీ అయినా గాంధీనగర్కైనా తమ పార్టీ కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సవాల్ చేశారు. రైతుబంధు పేరుతో రూ.14 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు రైతాంగానికి పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని విపక్షాలకు స్పష్టంచేశారు. రైతుల సహజ మరణాలకూ బీమా వర్తించేలా రైతు బీమా పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు పీడిత ప్రాంతంగా మార్చిన ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్‌దేనని, రెండు లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడేందుకు కారణం ఆ పార్టేనని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.