నిర్మల్ : నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్(CM KCR)ను మరోసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర అటవిశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Minister Indrakaran reddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, కేంద్రంలోని బీజేపీ అవలంభిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. మంగళవారం నిర్మల్ పట్టణ బీఆర్ఎస్(Brs) కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
రాబోయేఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ విజన్(Vision)తో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందంజ లో పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. పొరుగు రాష్ట్రాలు సైతం తెలంగాణ పథకాలు, పాలన వైపు చూస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని అన్నారు.
Minister Indrakaran Reddy 1
ప్రతిపక్షాల మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, ప్రజలతో పథకాలపై చర్చిస్తూ వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. నల్లధనం తీసుకువచ్చి ప్రతిఒక్కరి అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారని, నల్లధనం అరికట్టడం ఏమో గాని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు.
కేంద్రాన్ని నిలదీసిన సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వివరించారు. ఎన్నికల సమయంలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపినిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి గంగాధర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.