సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 10: సీఎం కేసీఆర్ స్వగ్రామం.. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పట్టాభిరాముడి విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండువగా జరిగింది. ఆదివారం ఆలయ శిఖర సంప్రోక్షణ, రాములోరి కల్యాణం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన దాతలు, పని చేసిన వారందరిని హరీశ్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచనలతో గ్రామంతోపాటు పట్టాభిరాముడి ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసుకున్నామని తెలిపారు.
గతంలో దేవుడి నిధులను వాడుకొనేవారని, నేడు ప్రభుత్వమే ఆలయాలకు నిధులు కేటాయిస్తున్నదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లతో, పసిడి పంటలతో స్వామివారి దయతో ఆనందంగా జీవిస్తున్నారని చెప్పారు. చింతమడక అంటే చింతలు లేని మడక గ్రామంగా రూపుదిద్దుకొన్నదన్నారు. శ్రీరాముడు కుటుంబ సమేతంగా ఏకశిలా విగ్రహంపై ఉన్న ఆలయం చింతమడకలోనే ఉండటం ఈ గ్రామ ప్రజల అదృష్టమన్నారు. అనంతరం గ్రామంలో రూ.3 కోట్లతో శివాలయ పునరుద్ధరణ పనులకు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.