బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 02:27:37

ఫలించిన పోరాటం

ఫలించిన పోరాటం

  • జీఎసీ ్టపరిహారంపై దిగివచ్చిన కేంద్రం
  • రాష్ర్టాలకు రూ.20 వేల కోట్లు విడుదల
  • తెలంగాణకు రానున్న రూ.2,638 కోట్లు
  • కేంద్రమే అప్పు తీసుకొనైనా చెల్లించాలి
  • ఆప్షన్లను ఎంతమాత్రం ఒప్పుకొనేది లేదు
  • జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో ఆర్థికమంత్రి హరీశ్‌
  • మద్దతు పలికిన మిగతా రాష్ట్రాల మంత్రులు

  హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీఎస్టీ పరిహారం పొందడం రాష్ర్టాలకు చట్టబద్ధంగా వచ్చిన హక్కు అని, కేంద్రప్రభుత్వం దానిని హరించొద్దని రాష్ట్ర ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే అప్పు తీసుకొని రాష్ర్టాలకు పంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన సోమవారం జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమైం ది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు.. ముందుగా జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్మెంట్‌పై చర్చకు పట్టుపట్టారు. పలు రాష్ర్టాల ఆర్థికమంత్రులు ఆయనకు మద్దతు పలుకడంతో కౌన్సిల్‌ దిగివచ్చింది. 

  హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. ఆప్షన్లను ఒప్పుకొనే ప్రసక్తేలేదని, మొత్తం కేంద్రమే చెల్లించాలని అన్నారు. గత ఆరునెలల్లో మూడు ఇన్‌స్టాల్‌మెంట్లు ఇవ్వాల్సి ఉన్నదని గుర్తుచేశారు. ఈ కాలంలో సెస్సు రూపంలో కేంద్ర ఖజానాలోకి రూ.30వేల కోట్లు చేరాయని చెప్పారు. వాటిని వెంటనే రాష్ర్టాలకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా, లాక్‌డౌన్‌తో ఆర్థికనష్టాల్లో ఉన్న రాష్ర్టాలకు ఈ నిధులు అత్యంత అవసరమని తెలిపారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రాష్ర్టాలకు పెంచిన రుణపరిమితిని జీఎస్టీ పరిహారం చెల్లింపులకు ముడిపెట్టవద్దని అన్నారు.

  దిగివచ్చిన కేంద్రం

  2017-18కి సంబంధించిన ఐజీఎస్టీ రూ.24వేల కోట్లను రాష్ర్టాలకు పంచకుండా సొంతానికి వాడుకున్న కేంద్రంపై తెలంగాణతోపాటు పలు రాష్ర్టాల పోరాటం ఫలించింది. సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనూ మంత్రి హరీశ్‌రావు ఐజీఎస్టీ నిధులను రాష్ర్టాలకు పంచాల్సిందేనని డిమాండ్‌చేశారు. ఇందులో తెలంగాణ వాటాగా రూ.2,638కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. దీంతోపాటు రివర్స్‌ అండ్‌ ల్యాప్స్‌ ఐజీఎస్టీ ఐటీసీని కూడా కొన్నాళ్లుగా రాష్ర్టాలకు చెల్లించడం లేదని నిలదీశారు. ఇందులో తెలంగాణ వాటాగా రూ.1000 కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ర్టాల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఐజీఎస్టీ మొత్తం రూ.24వేల కోట్లను వారం రోజుల్లో రాష్ర్టాలకు చెల్లిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. అయితే రివర్స్‌ అండ్‌ ల్యాప్స్‌ ఐజీఎస్టీపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.


  నో ఆప్షన్స్‌..

  జీఎస్టీ పరిహారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆప్షన్లను తెలంగాణతోపాటు పశ్చిమబెంగాల్‌, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలు సోమవారం మరోసారి తిరస్కరించాయి. పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. దీంతో ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించింది. మరిన్ని సంప్రదింపులు జరిపేందుకు ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  ఐజీఎస్టీ పరిహారం కోసం రాష్ర్టాలు చేస్తున్న పోరాటానికి కేంద్రం దిగివచ్చింది. ఐజీఎస్టీ మొత్తం రూ.24వేల కోట్లను వారంలో రాష్ర్టాలకు చెల్లిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. దీంతో తెలంగాణకు త్వరలో రూ.2,638 కోట్లు రానున్నాయి. అయితే రివర్స్‌ అండ్‌ ల్యాప్స్‌ ఐజీఎస్టీపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు జీఎస్టీ పరిహారంపై తెలంగాణ వైఖరిని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. జీఎస్టీ పరిహారాన్ని కేంద్రమే అప్పు తీసుకొని రాష్ర్టాలకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


  logo