సంగారెడ్డి: రైతులను కొట్టు.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్లగా కేంద్రం తీరు తయారైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పఠాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలన రైతులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధ్యానం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ వినలేదని విమర్శించారు.
నూకల ఎగుమతిపై నిషేధం, వరి ఎగుమతిపై 20 శాతం సుంకం విధించారని చెప్పారు. సాధారణంగా దేశంలో ఆహార నిల్వలు తగ్గినప్పుడు నిషేధం పెడుతారు. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. దేశ ఆహార భద్రతకు భరోసా లేకుండా చేస్తున్నారని ఫైరయ్యారు. కేంద్రం అసంబద్ధ నిర్ణయాలవల్ల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నాని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు.. అది ఏమైందని నిలదీశారు.
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని, సగం భారతావనికి అన్నం పెట్టే రాష్ట్రంగా అవతరించిందని మంత్రి హరీశ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలో 72 లక్షల ఎకరాల్లో వరి పండితే, ఇప్పుడు 10 ఉమ్మడి జిల్లాలో 65 లక్షల ఎకరాల్లో వరి పండిందని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి అతి త్వరలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని, మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని వెల్లడించారు. అదేవిధంగా పఠాన్‌చెరులో మల్టీ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.