కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని, కర్ణాటక పరిస్థితులే ఇక్కడ పునరావృతం అవుతాయని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలన్నారు.
సమైక్య పాలనలో ఆంధ్రోళ్లే ముఖ్యమంత్రులుగా ఉండేదని..తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వక అరిగోస పడ్డామని గుర్తు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని.. స్వయం పాలనలో సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతో గొప్పగా అభివృద్ధి చేశానని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడే కనిపించి మాయమవుతారని.. ఆ పార్టీలకు ఓటు వేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడైనా కనిపించాడా అని ప్రశ్నించారు.
నేను మీ కళ్ల ముందు పెరిగిన బిడ్డను. మరోసారి నన్ను ఆశీర్వదిస్తే గొప్పగా పనిచేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్టల కరుణ, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీలు పట్టెం శారద, లక్ష్మీనారాయణ, తిరుపతి నాయక్, నాయకులు జయ ప్రకాష్, పిల్లి మహేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.