కరీంనగర్ జూలై 11 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేసిన మౌన దీక్ష పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీజేపీ మోసపూరిత విధానాలపై ఘాటుగా స్పందించారు.
ధరణి సమస్యలు పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పేర్కొంటూ సోమవారం బండి కరీంగనర్‌లో రెండు గంటల పౌటు మౌన దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అది మౌన దీక్ష కాదని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చేస్తున్న ఆసూయ దీక్ష అని విమర్శించారు.
సంజయ్ తన దీక్ష సందర్భంగా అతని పక్కనే సీఎం కేసీఆర్ కోసం అంటూ మహారాజా కుర్చీ వేసారని, నిజానికి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మహారాజే అని పేర్కొన్నారు. అయితే కుర్చీ వేసి దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని, కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల కోసం, నిధుల కోసం ప్రధాని మోదీ ముందు చేయాలని మంత్రి సూచించారు.
అలా బండి చేస్తే..ఆ దీక్షలో తాను కూడా పాల్గొంటానని స్పష్టం చేశారు. మోదీ ఆఫీస్ ముందు కుర్చీ వేసుకొని అడుగాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయన్నారు. దానికి బండి సంజయ్ సిద్ధంగా ఉన్నారో లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు.
గత ఎన్నికల హామీల్లో భాగంగా ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని ఎందుకు వేయలేదో ప్రశ్నిస్తూ.. ఏ బ్యాంకు, ఏ ఏటీఎం ముందు దీక్ష చేయాలో అడుగాలన్నారు.
అలాగే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా మని హామీ ఇచ్చారు. ఆ లెక్కన గడిచిన ఏనిమిదేళ్ల పాలనలో మొత్తం 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇందుకోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు కుర్చీ వేసి దీక్ష చేద్దామా అని సవాల్ విసిరారు. బ్లాక్ మనీ కోసం ఆర్బీఐ, ఈడీల ముందు కుర్చీ వేసుకొని దీక్ష చేద్దాం రమ్మంటూ సంజయ్‌కు సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై ప్రధాని ముందు ధర్నా చేసే సత్తా బండికి ఉందా అని పశ్నించారు.
ఈ తరహా ధర్నాకు దేశంలో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ వస్తుందని, వారితో పాటుగా మేము రావడానికి సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటీకరణ చేసిన ప్రధానిని నిలదీసేందుకు మౌన దీక్ష చేయాలని సూచించారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని 2014లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంచేసి పంపినా నేటికి దిక్కులేదన్నారు.
బీసీ గణన చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరితే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బీసీలపై ఇంత వివక్షతో కేంద్రం వ్యవహరిస్తుంటే.. ఓ బీసీ బిడ్డవై ఉండి మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బండి పై ఫైర్ అయ్యారు.
ధరణి అమల్లోకి తెచ్చి 98 శాతం భూ సమస్యలకు పరిష్కారం చూపిన గొప్ప సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. మిగిలిన ఒకటి రెండు శాతం రెవన్యూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సూడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, మేయర్ సునీల్ రావు, బండ శ్రీనివాస్, చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.