పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 4: భాగవత సృష్టికర్త, సహజ కవి పోతన నడియాడిన నేల ఓ పుణ్యభూమి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో పోతన జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతన సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కలంతోపాటు హలం పట్టిన గొప్ప కవి పోతన అని కొనియాడారు. పోతన జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పాలకుర్తి మహా కవులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. పాలకుర్తిలో పాల్కురికి సోమనాథుడు, బమ్మెరలో పోతన, వల్మిడిలో వాల్మీకి మహాముని జన్మించారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కవులు, కళాకారులకు గుర్తింపు లభించిందన్నారు. బమ్మెర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
బమ్మెరలో మార్మోగిన పోతన నామస్మరణ
జయంతి ఉత్సవాల సందర్భంగా పోతన నామస్మరణతో బమ్మెర గ్రామం మార్మోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారుల ఆటపాటలతో ఊరంతా కళకళలాడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సుప్రసిద్ధ కవులు కోవెల సుప్రసన్నాచార్యకు స్వర్ణకంకణం, ప్రొఫెసర్ రామాచంద్రమౌళికి ఉంగరం తొడిగి సత్కరించారు. అష్టావధాని శ్రీహర్షతోపాటు పలువురు కవులను సన్మానించారు.