తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
అర్ధరాత్రి.. ఊరంతా నిద్దురపోతున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బుల్డోజర్లు పేదల ఇండ్లవైపు దూసుకొచ్చాయి. వందల ఇండ్లపై విరుచుకుపడ్డాయి. పేక మేడలా ఒక్కో ఇంటిని కుప్పకూల్చారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే 348 ఇండ్లను నామరూపాలు లేకుండా చేశారు.
- 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
- కన్నీటి పర్యంతమైన బాధితులు
- ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదంటూ మండిపాటు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు
- భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం శాత్రాజుపల్లి గ్రామంలో ఘటన
- ఇండ్లు కట్టియ్యకపోతే ఆత్మహత్యలే దిక్కు : సర్కార్‌కు బాధితుల హెచ్చరిక
మల్హర్, అక్టోబర్ 11 : అర్ధరాత్రి.. ఊరంతా నిద్దురపోతున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బుల్డోజర్లు పేదల ఇండ్లవైపు దూసుకొచ్చాయి. వందల ఇండ్లపై విరుచుకుపడ్డాయి. పేక మేడలా ఒక్కో ఇంటిని కుప్పకూల్చారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే 348 ఇండ్లను నామరూపాలు లేకుండా చేశారు. లక్షల రూపాయల అప్పుచేసి కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడానికి చేతులు ఎలా వచ్చాయంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామ పంచాయతీ పరిధి శాత్రాజుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. వందల మంది నిరుపేదల ఇండ్లను కూల్చడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శాత్రాజుపల్లికి శనివారం అర్ధరాత్రి కాటారం సబ్ కలెక్టర్ సౌరభ్ శర్మ నేతృత్వంలో డీఎస్పీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, అగ్నిమాపకశాఖ అధికారులు సుమారు 200 మంది పోలీస్ బలగాలతో చేరుకున్నారు. గ్రామస్తులంతా నిద్రిస్తున్న సమయంలో దాదాపు 12 జేసీబీలతో 348 ఇండ్లను కూల్చివేత మొదలుట్టారు. హడావుడికి బాధితులంతా బయటకు వచ్చి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బాధితులను పోలీసులు కట్టడి చేయగా, గంటల వ్యవధిలోనే వందల ఇండ్లను ఎక్కడికక్కడ కూల్చివేసి వెళ్లిపోయారు.
ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.4లక్షల వరకు ఉంటుందని బాధితులు చెప్తున్నారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2 గని తవ్వకాల కోసం ఇండ్లను కూల్చివేశారని వారు లబోదిబోమంటున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు విచక్షణా రహితంగా ఇండ్లను కూల్చివేశారని వాపోతున్నారు. తాడిచెర్ల భూ నిర్వాసితులు ఆరు నెలల కిందటే శాత్రాజుపల్లిలో రూ.లక్షలు అప్పు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. తమకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని బాధితులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టిన బాధితులు.. కూల్చిన చోటే తిరిగి ఇండ్లు కట్టించి ఇవ్వాలని, లేదంటే నష్టపరిహారమైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదీగాకపోతే ఇక్కడే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.

పేదలంటే కాంగ్రెస్‌కు ఎందుకింత వివక్ష
మేము ఆరునెలల కిందటే శాత్రాజుపల్లిలో గుంట భూమి కొనుక్కొని రూ.4లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అధికారులు వచ్చి ఒక్క మాట చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. పేదలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కడుపు మంట. పేదల పాపం ఊరికే పోదు. ఇంతకింతకు అనుభవించి తీరుతరు. పేదలను ఏడిపించిన ఏ సర్కార్ బాగుపడలేదు. రేవంత్‌రెడ్డికి కూల్చడం తప్పితే ఇంకొకటి తెల్వనట్టు ఉన్నది. మాకు నష్ట పరిహారం చెల్లించాలి. లేదంటే ఇంత పురుగుల మందు ఇస్తే ఇక్కడే తాగి ఆత్మహత్య చేసుకుంటం.
-సిద్ధ దేవరాణి, బాధితురాలు, తాడిచెర్ల
కాంగ్రెస్‌కు ఓటేసినందుకు మాకీ శాస్తి జరగాల్సిందే..
కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు అనుభవిస్తున్నాం. లక్షలు అప్పు తెచ్చి శాత్రాజుపల్లిలో ఇల్లు కట్టుకున్నం. అప్పుడు రాని అధికారులు ఇప్పుడొచ్చి అదీ కూడా అర్ధరాత్రి దొంగల్లాగా ఇండ్లపై దాడి చేసి కూల్చివేయడం దారుణం. ఇంతకంటే పురుగుల మందిచ్చినా అందరం ఆనందంగా తాగి చచ్చేటోళ్లం. మేమేం పాపం చేసినం. మా ఉసురు తప్పక తగుల్తది. కూల్చిన చోటే మళ్లీ కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటం. రెక్కల కట్టం చేసుకొని బతికేటోళ్లం. పేదలు వీళ్లేంచేస్తరనే ధీమాతోనే ఇండ్లను కూల్చివేస్తరా? ఎక్కడెక్కడో పెద్దలు కబ్జాలు చేస్తే వాళ్ల జోలికి పోరు. అప్పు చేసి గుంట భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్న పేదోళ్ల ఇండ్లను మాత్రం కూల్చివేస్తారా? ఇంతకింతకు అనుభవించి తీరుతరు.
-పోట్ల రాజమ్మ, చిన్నతూండ్ల

అనుమతులు లేనందునే కూల్చివేశాం
పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇండ్లను కూల్చివేయాల్సి వచ్చింది. అది ప్రభుత్వ భూమి, అక్కడ నిర్మించుకున్న ఇండ్లకు ఎలాంటి అనుమతులు లేవు. నాలుగు రోజుల కిందట సమగ్ర సర్వే చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అనుమతులు లేనందునే ఇండ్లను తొలగించాం.
-రవికుమార్, తహసీల్దార్, మల్హర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

