మెట్పల్లి, అక్టోబర్ 23: విలేకరులమని చెప్పుకొంటూ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌కు చెందిన తిరుమలశెట్టి జైబాబు తన తండ్రి నాగేశ్వర్రావుతో కలిసి లారీలో ఇసుక రవాణా చేస్తుంటారు. ఈ నెల 21న రాత్రి మెట్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారిపై ఇసుక లారీ వెళ్తుండగా మెట్పల్లి మండలం మేడిపల్లికి చెందిన తరి రాజశేఖర్, ఇబ్రహీంపట్నంకు చెందిన బోడ దివాకర్, మెట్పల్లి వాసి నన్నపు రవిరాజు రెండు బైక్‌లపై వచ్చి అడ్డుకున్నారు.
ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, తమకు రూ.10 వేలు ఇవ్వాలని, లేదంటే మీడియాలో వార్త ప్రచురిస్తామని బెదిరించా రు. సదరు ఇసుక రవాణాదారుడు రూ. 5 వేలు ఇచ్చాడు. అందుకు ఒప్పుకోకపోగా మిగతా రూ. 5 వేలు కూడా ఇవ్వాలని బెదిరిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు అటు వైపు వస్తున్నట్టు గమనించిన ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. జైబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై తెలిపారు.