హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఆధునిక యుగంలో సాంకేతికతతో పాటు మానవ మనుగడకు మానసిక పరిపక్వత చాలా ముఖ్యమని సైకాలజిస్టులు అభిప్రాయపడ్డారు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ మీడియా పార్టనర్‌గా దోమలగూడలోని ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో యూ అండ్ మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఎగ్జిబిషన్ అండ్ ట్రైనింగ్ శుక్రవారంతో ముగిసింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న యూ అండ్ మీ సంస్థ కన్వీనర్, సైకాలజిస్టు డాక్టర్ సీ వీరేందర్, డాక్టర్ చంద్రకాంత్, సైకాలజిస్ట్ విశేష్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత చాలామంది విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి సన్నగిల్లిందని తెలిపారు. ఆలస్యంగా నిద్రలేవడం, కుటుంబసభ్యులపై చిరాకుపడటం, ఏకాగ్రతను కోల్పోవడం లాంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని వెల్లడించారు. అలాంటివారికోసమే మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. 700 మందికి శిక్షణతో పాటు ఉచితంగా కౌన్సెలింగ్ ఇచ్చామని డాక్టర్ వీరేందర్ తెలిపారు. కార్యక్రమంలో ఏవీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజలింగం, అధ్యాపకులు, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.