నీలగిరి, నవంబర్ 9 : పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి పైసా నిధులు ఇవ్వకపోగా తిట్ల పురాణం పెట్టడం సిగ్గుచేటని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పుట్టిన రోజైనా రేవంత్‌రెడ్డి తన బుద్ధి, భాష మార్చుకోకపోవడం సిగ్గుచేటన్నారు. 11 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకొనేందుకు ఏమీ లేక కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి వాడుతున్న భాష సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నదో ఆలోచించుకోవాలని హితవు పలికారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కి స్తం.. ముక్కలు చేస్తాం… కుక్క చావు చస్తావ్ అంటూ మా ట్లాడడం హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం స్థాయిని దిగజార్చుతున్న రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం సిగ్గూశరం ఉన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.