Viral News | కొండాపూర్, డిసెంబర్ 16: అంతర్జాతీయ సెలబ్రిటీలతో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హైడర్ (సెలబ్రిటీ కుక్క) శనివారం శేరిలింగంపల్లి మదీనాగూడలోని విశ్వ పెట్ క్లినిక్‌లో సందడి చేసింది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ సెలబ్రిటీ డాగ్ బ్రీడర్ సతీశ్.. కెడాబోమ్స్ రష్యాకు చెందిన కొకేషన్ షెపర్డ్ జాతి కుక్క (కెడాబోమ్స్ హైడర్)తో కలిసి పెట్ క్లినిక్‌ను సందర్శించారు. హైడర్‌ను రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్టు, ప్రస్తుతం సినీ తారలతో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినట్టు సతీశ్ తెలిపారు.
సినిమాల్లో ప్రత్యేక పాత్రలు, అంతర్జాతీయంగా సెలబ్రిటీగా హైడర్ కొనసాగుతుందని చెప్పారు. పలు ఫ్యాషన్ షోలలో సైతం పాల్గొనాలని ఆహ్వానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ డాగ్‌కు ప్రతి రోజు 3 కిలోల మాంసంతోపాటు ఏసీ అవసరమని వివరించారు. హైడర్తో ఫొటోలు దిగేందుకు పలువురు జంతు ప్రేమికులు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో విశ్వ పెట్ క్లినిక్ నిర్వాహకులు చైతన్య, సతీశ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.