హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ డిజైన్స్ ఆర్డనైజేషన్ (సీడీవో) సీఈదేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. నిర్ణీత గడువులోగా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బరాజ్ పునరుద్ధరణ డిజైన్లను అందివ్వాలని వెల్లడించింది. ఈ మేరకు సీడీవో సీఈకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ పునరుద్ధరణకు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సీపేజీ సమస్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) పలు సిఫారసులు చేసింది. చేయాల్సిన సాంకేతిక పరీక్షలు, చేపట్టాల్సిన నివారణ చర్యలను సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా పనులకు సంబంధించి డిజైన్లు ఇవ్వాలని ప్రభుత్వం సీడీవోను కోరింది. సీడీవో మాత్రం డిజైన్లు ఇవ్వడం లేదు.
అంతేకాకుండా బరాజ్‌లకు సంబంధించి డిజైన్లు ఇవ్వలేమని, ఎన్డీఎస్ఏ సూచించిన కేంద్ర సంస్థలను కన్సల్టెంట్‌గా పెట్టుకొని డిజైన్లు చేయించుకోవాలని సీడీవో సూచించింది. సీడీవో తీరుపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తాజాగా సీడీవోకు లేఖ రాసింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి డిజైన్లు ఇచ్చేందుకే నోడల్ డిపార్ట్మెంట్ సీడీవో ఉన్నదని, సీడీవోనే డిజైన్లు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. కన్సల్టెన్సీలను పెట్టుకోమని చెప్పడం సీడీవో పని కాదని ఘాటుగా స్పందించింది. గతంలో బరాజ్‌లకు డిజైన్లు ఇచ్చింది సీడీవోనే అని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో సీడీవోనే ఇప్పుడు కూడా డిజైన్లు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు నిపుణుల సేవలు అవసరమైతే ఆ దిశగా సీడీవోనే చర్యలు చేపట్టాలని, పునరుద్ధరణ, సాంకేతిక నిపుణులైన ఏజెన్సీలను గుర్తించి వాటితో సంప్రదించాలని తెలిపింది.