ఖైరతాబాద్, ఫిబ్రవరి 26 : వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడిచింది. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమెను బతికించేందుకు నిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యనభ్యసిస్తున్న డాక్టర్ ప్రీతి.. సీనియర్ వేధింపులతో ఈ నెల 22న ఆత్మహత్యకు యత్నించింది. స్థానిక వైద్యశాలలో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో నిమ్స్ దవాఖానకు తరలించారు. దీంతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ నేతృత్వంలో వైద్యుల బృందం ఆమెకు మెరుగైన చికిత్సను ప్రారంభించింది. ఔట్‌పేషెంట్ బ్లాక్‌లోని ఏఆర్సీయూలో ఉంచి చికిత్స ఇచ్చారు.
జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అనస్థీషియా విభాగం వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యసేవలందించారు. ఆమెను బతికించేందుకు ఎక్మో, సీఆర్ఆర్టీ లాంటి అత్యాధునిక చికిత్సలను అందించారు. కానీ వైద్యుల శ్రమ ఫలించలేదు. ఆమె అవయవాలు ఒక్కొక్కటి దెబ్బతింటూ రావడంతో వైద్యానికి సహకరించలేదు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో ఆదివారం ఉదయం బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్టు వైద్యులు నిర్ధారించి తల్లిదండ్రులకు వివరించారు. రాత్రి 9.10 గంటలకు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు మెడికల్ సూపరింటెండెంట్ హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
ప్రీతి మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రీతి ఘటనపై విచారణ నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కుటుంబానికి ధైర్యమిచ్చి.. డాక్టర్ ప్రీతిని నిమ్స్‌లో చేర్పించినప్పటి నుంచి రాష్ట్ర అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఆమె ఆరోగ్యపరిస్థితిపై ప్రత్యేక్ష శ్రద్ధ పెట్టింది. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు తదితరులు స్వయంగా నిమ్స్ దవాఖానకు వెళ్లి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు వైద్యులతో ఆరాతీశారు. తల్లిదండ్రులు శారద, దరావత్ నరేందర్నాయక్ను పరామర్శించి ఓదార్చారు. వారు ఆత్మైస్థెర్యం కోల్పోకుండా భరోసా కల్పించారు.
‘ప్రీతి ఘటనకు కులాన్ని అంటగట్టొద్దు’
వరంగల్‌కు చెందిన మెడికో ప్రీతి సంఘటన దురదృష్టకరమని ఆల్ తెలంగాణ ట్రైబల్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రీతి సమస్యను గిరిజన లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యగా చూడొద్దని విన్నవించారు. ఇంటికి దూరంగా ఉంటూ, ఉన్నత చదువులు చదివిన ఒక ఆడపిల్ల సమస్యగా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు డాక్టర్ అమర్‌సింగ్, డాక్టర్ రామ్‌సింగ్, దశరథ్ నాయక్, గోపాల్, తదితరులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడం అత్యంత దురదృష్టకరం, బాధాకరమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వపరంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ప్రీతి ఘటన పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తంచేశారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నదని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ప్రీతి ఆత్మ శాంతించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
దోషులను వదిలిపెట్టం: మంత్రి హరీశ్‌రావు
వైద్య విద్యార్థిని ప్రీతి మృతి పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతికి సంతాపం తెలిపారు. ప్రీతి మృతి అత్యంత బాధాకరమని, ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తుందని ఆశించామని పేర్కొన్నారు. ఆమె మృతి తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రీతి సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరుపుతున్నదని, నివేదిక ఆధారంగా నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దోషిగా తేలితే హెచ్వోడీపైనా చర్యలు తప్పవని చెప్పారు.
మెడికో మృతి దురదృష్టకరం: సత్యవతి రాథోడ్
మెడికో విద్యార్థిని ప్రీతి మృతికి మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం ప్రకటించారు. మృత్యువుతో పోరాడుతూ ప్రీతి తుది శ్వాస విడవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలి : నిరంజన్‌రెడ్డి
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
దురదృష్టకరం: ఇంద్రకరణ్‌రెడ్డి
వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రీతి మృతి దిగ్భ్రాంతికరం: వినోద్‌కుమార్
ప్రీతి మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ అకాల మరణం చెందడం కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రీతి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ప్రీతి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
ప్రీతి మృతి బాధాకరం: గంగుల కమలాకర్
వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమవడం బాధ కలిగించిందని చెప్పారు. ప్రీతి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలి: తలసాని
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.