BJP | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): బీజేపీలో ఎంపీ టికెట్ల మంటలు ఇంకా ఆరడం లేదు. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. మల్కాజిగిరి టికెట్ ఇవ్వనందుకే రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నేతలను పక్కనబెట్టి బయటి నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది.
మరోవైపు మాజీ ఎంపీలు గోడెం నగేశ్, సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్ ఆదివారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వీరికి టికెట్ల ఇస్తామన్న హామీ మేరకు పార్టీలో చేరినట్టు సమాచారం. నల్లగొండ ఎంపీ టికెట్‌ను సైదిరెడ్డికి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో జిల్లా బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో సైదిరెడ్డి తమను తీవ్రంగా హింసించారని చెప్తున్నారు.