హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎండోస్కోపిక్ విధానంలో చేసే వెన్నెముక శస్త్రచికిత్సలో పెద్దగా నొప్పి ఉండదని, ఓపెన్ సర్జరీ కంటే ఈ విధానం రోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఏఐజి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ నరసింహన్ చెప్పారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో స్పైన్ ఎండోస్కోపి రిసెర్చ్ ఫౌండేషన్ (ఎస్ఇఆర్ఎఫ్), భారత్ అకాడమీ ఆఫ్ స్పైన్ ఎండోస్కోపి (బీఏఎస్ఈ) సహాకారంతో లైవ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సెషన్లతో నిర్వహించిన మాస్టర్ క్లాస్‌లలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరసింహన్ మాట్లాడుతూ.. వైద్యవిజ్ఞాన రంగంలో తక్కువ కోతలతో చేసే శస్త్రచికిత్సలు ఈ రోజుల్లో పెరిగాయని పేర్కొన్నారు.పూర్తి ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఎక్కువ నొప్పి లేకుండా వెన్నెముక శస్త్రచికిత్స చేసే కార్యక్రమానికి ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఎండి డాక్టర్ సుకుమార్ నాయకత్వం వహిస్తున్నారని, ఎండోస్కోపిక్ ప్రక్రియ సునిశితంగా కచ్చితమైన ప్రమాణాలతో జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని ప్రామాణీకరించే క్రమంలో మాస్టర్ క్లాస్‌లు నిర్వహించిన డాక్టర్ సుకుమార్‌ను డాక్టర్ నరసింహన్ ఈ సందర్భంగా అభినందించారు. ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ స్పైన్ సర్జరీకి సంబంధించి సమాజంలో చాలారకాల అపోహలు ఉన్నాయని, వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినప్పుడు ప్రజలు చాలా ఆందోళన చెందుతారని అన్నారు. అయితే అధునాతన సాంకేతికతతో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా శస్త్రచికిత్స చేయవచ్చని, అందులో భాగమే ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని వివరించారు. ఈ పద్ధతి గురించి ప్రపంచ స్థాయి అధ్యాపకులతో వైద్యులకు సంపూర్ణ శిక్షణ అందించి, అవగాహన కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ మాస్టర్‌క్లాస్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూకె, యూఎస్ఏ, మలేషియా, తైవాన్, ఈజిప్ట్ దేశాలకు చెందిన వైద్యనిపుణులతో పాటు ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఈవో నరేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.