హిమాయత్‌నగర్, ఫిబ్రవరి12 : ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌లో నివాసముండే కేడియా.. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి దుబాయికి వెళ్లాడు. ఈ క్రమంలో అతని వద్ద పనిచేసే మేనేజర్ అభయ్ బుధవారం యజమాని ఇంటికి వచ్చాడు. ఇంటితాళాలు పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు కిందపడి ఉన్నాయి. గమనించి వెంటనే యజమాని కేడియాకు సమాచారం అందించారు. అతని సూచన మేరకు బీరువాలో దాచిన రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.20 లక్షల నగదు ఉందో, లేదో చూడమని చెప్పడంతో.. అతను బీరువాను పరిశీలించగా ఏమీ కనిపించలేవు. దీంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.