హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): దేశంలో నిరుద్యోగం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం గణనీయంగా తగ్గుతున్నది. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే, తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగాల సృష్టి, ఉపాధి కల్పన పెరుగుతున్నది. ఫలితంగా నిరుద్యోగిత రేటులో భారీగా తగ్గుదల కనిపిస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక సమాచారం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది.
ఆర్బీఐ హ్యాండ్‌బుక్-2022 నివేదిక ప్రకారం.. 2017-18 సంవత్సరంతో పోల్చితే.. 2020-21లో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గింది. మూడేండ్లలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల సంఖ్య దాదాపు సగానికి పైగా తగ్గిందని పేర్కొన్నది. 2017-18లో రూరల్‌లో ప్రతి వెయ్యి మందికి 65 మంది నిరుద్యోగులు కాగా, 2020-21లో ఆ సంఖ్య 34కు చేరింది.
అదేవిధంగా అర్బన్‌లో 2017-18లో ప్రతి వెయ్యి మందిలో 94 మంది నిరుద్యోగులుగా ఉండగా, 2020-21లో ఆ సంఖ్య 77కు తగ్గింది. ఇక రాష్ట్రంలో మహిళా నిరుద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూరల్‌లో 2017-18వ సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది మహిళల్లో 50 మంది నిరుద్యోగులు కాగా, 2020-21 నాటికి 22 మంది మాత్రమే నిరుద్యోగులుగా ఉన్నారు. అర్బన్ ప్రాంతంలో 2017-18లో ప్రతి వెయ్యి మందిలో 128 మంది నిరుద్యోగులుగా ఉండగా, 2020-21లో 111కి ఆ సంఖ్య తగ్గింది.