హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): బిగ్‌బ్రదర్స్ కుటుంబం రాష్ట్రంలో క్రికెట్ అభిమానుల ఆశలకు గండి కొట్టినట్టు తెలుస్తున్నది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం చివరి మ్యాచ్ జరుగనున్నది. ఈ సీజన్లో హైదరాబాద్‌లో జరుగనున్న చివరి మ్యాచ్ కావడం, అదీ హాట్ ఫేవరేట్లయిన హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య జరుగనుండటంతో టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా నిర్వాహకులు టికెట్ల ధరలను భారీగా పెంచేశారు. ఒక్కో టికెట్‌పై రూ.వెయ్యి నుంచి రూ.15వేల వరకు పెంచినట్టు తెలిసింది. ఇంత క్రేజ్ ఏర్పడిన ఈ మ్యాచ్‌పై బిగ్‌బ్రదర్స్ దృష్టి పడింది. వెంటనే నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి 500 టికెట్లను బ్లాక్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయం క్రికెట్ అభిమానుల్లో పెనుదుమారం రేపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రంగాల్లో జోక్యం చేసుకుంటూ వేల కోట్ల సామ్రాజ్యాలు కట్టుకుంటున్న బిగ్‌బ్రదర్స్ ఇప్పుడు ఐపీఎల్ టికెట్లను కూడా దోచుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్‌బ్రదర్స్ ఒకేసారి 500 టికెట్లను బ్లాక్ చేయడంపై ఓ జాతీయ పార్టీ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి కొందరు నాయకులు మ్యాచ్ నిర్వాహకులను ప్రశ్నిస్తే.. ‘ఉన్నవన్నీ వాళ్లే తీసుకుంటే.. మేమేం చేయాలి.. మీకెక్కడి నుంచి తేవాలి’ అని సమాధానం వచ్చిందట. దీంతో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇంత ఘోరమా అంటూ వాపోతున్నారట. టికెట్ల కోసం పోలీసు అధికారులకు కూడా భారీగా వినతులు వస్తున్నాయని, కానీ వారు కూడా చేతులెత్తేసినట్టు తెలిసింది.
హైదరాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్ టికెట్ల ధరలను నిర్వాహకులు భారీగా పెంచేశారు. గతంలో కనిష్ఠంగా రూ.750 ఉన్న టికెట్ ధరను రూ.2 వేలకు పెంచేశారు. బాక్స్ ధర గతంలో రూ.30 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.45 వేలకు పెంచేశారని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా.. అందులో సాధారణంగా 10 శాతం టికెట్లు అంటే 3,900 హైదరాబాద్ క్రికెట్ క్లబ్‌కు అందజేస్తుంటారు. అందులో 217 క్రికెట్ క్లబ్‌లు, అపెక్స్ సభ్యులకు 75 శాతం వెళ్తుండగా, స్టేడియంలో పనిచేసే సుమారు 200 మందికి ఒక్కొక్కరికి ఒకటి, ప్రెసిడెంట్, సీఎం, గవర్నర్ బాక్స్‌లు, పోలీస్, మెట్రో, విద్యుత్తు, ఇండస్ట్రియల్ తదితర ప్రభుత్వ విభాగాలకు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్లకు ఈ టికెట్లు వెళ్తుంటాయి.
ఈ పంపకాలతో తమకు సంబంధం లేదని, ప్రత్యేకంగా 500 టికెట్లు కావాలంటూ బిగ్ బ్రదర్స్ డిమాండ్ చేసి.. ఆ టికెట్లను లాక్ చేయాలని హుకుం జారీచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్తో సంబంధాలున్న ఓ వ్యక్తి బిగ్‌బ్రదర్స్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఈ డీల్‌ను కుదిర్చేందుకు ముందుకు వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సీజన్లో ఇంతవరకు హైదరాబాద్‌లో మ్యాచ్‌లను చూడలేనివారు చాలామంది ఉన్నారు. వీరిలో రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, ఇతర విభాగాలలోని ప్రముఖులు ఉన్నారు. తమకు కాంప్లిమెంటరీ టికెట్లు వస్తాయన్న ఆశతో వీరు ఎదురుచూస్తున్నారు. ఇంతలో బిగ్‌బ్రదర్స్ జోక్యంతో వీరి కోటాకు గండిపడినట్టు తెలుస్తున్నది.