ఖైరతాబాద్, జూలై 2: గురుకులాల్లో రూ.2వేల కోట్ల అవినీతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ డిమాండ్ చేశారు. ‘గురుకులాల్లో అవినీతిపై బహిరంగ చర్చకు మేం సిద్ధం’. మీ కోసమే వేచి చూస్తున్నాం’ అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో జరుగుతున్న అవినీతిని నిరసిస్తూ గత నెలలో ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించామని, ఇందిరాపార్క్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
గురుకుల టెండర్లలో భారీ అవినీతి జరిగిన విషయంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాల్సిందిపోయి.. దానిని వెలుగులోకి తెచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌ను అరెస్టు చేసి నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు అరెస్టు చేయడం, తెలంగాణ భవన్ నుంచి బయటకు రాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గురుకులాల్లో విద్యార్థులకు అందించే పోషకాహారంలో కూడా భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని మంద శ్యామ్ ఆరోపించారు. మార్కెట్ ధరలకంటే ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి 20 నుంచి 40 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. ఒక్క గురుకుల వ్యవస్థలోనే రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగితే మిగతా శాఖల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. జేఏసీ కో కన్వీనర్లు నర్ర నిర్మల, జన్ను స్వరూప మాట్లాడుతూ కాంగ్రెస్ దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.