(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో ఎన్నో అద్భుత నిర్మాణాలు కండ్లముందు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు చెప్పబోతున్న నిర్మాణం ‘అంతకు మించి’ అనేలా ఉంటుంది. ఎందుకంటే ఈ భవంతి భూమి మీదనో, సముద్రం మీదనో లేక చంద్రమండలం మీదనో నిర్మించేది కాదు.. ఆకాశంలో! అవును. దాని పేరే ‘అనలెమ్మా టవర్’
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఆఫీస్ అనే నిర్మాణ సంస్థ ‘అనలెమ్మ’ టవర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. జియోసింక్రోనస్ ఆర్బిట్‌లో భూమి చుట్టూ తిరిగే ఓ ఆస్టరాయిడ్‌ను ఆధారంగా చేసుకొని ఈ భవంతిని ఆకాశంలో బలమైన కేబుల్స్ సాయంతో వేలాడదీస్తారు. తొలుత దుబాయ్ మీదుగా ఈ టవర్‌ను నిర్మించనున్నారు. ఆస్టరాయిడ్ కదలికకు అనుగుణంగా ఈ టవర్ ప్రపంచంలోని ఉత్తర, దక్షిణార్ధ గోళాలను ‘8’ అనే ఆకారంలో చుట్టివచ్చి ఆస్టరాయిడ్ వేగాన్ని బట్టి నిర్ణీత వ్యవధిలో మళ్లీ దుబాయ్‌కు చేరుకొంటుంది.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలకు, సరుకుల రవాణాకు ఈ టవర్ ఉపయోగపడనున్నది. సోలార్ బేస్డ్ ప్యానల్స్ ఈ టవర్ మొత్తానికి విద్యుత్తును అందిస్తాయని, మేఘాల నుంచి నీటి సరఫరా ఉంటుందని, పర్యావరణ కాలుష్యం అనే విషయమే ఉండదని కాన్సెప్ట్ సృష్టికర్తలు చెప్తున్నారు.
ఒకే సమయం, ఒకే ప్రాంతంలో ప్రతీరోజూ నిలబడి ఏడాది పాటు సూర్యుడి గమనాన్ని పాయింట్ల రూపంలో గ్రాఫ్ పేపర్ మీద గుర్తిస్తే, ఆ పాయింట్లతో ‘8’ ఆకారం రూపొందుతుంది. అంటే ఆ ‘8’ ఆకారం భూమి పూర్తి పరిభ్రమణాన్ని సూచిస్తుంది. తాజాగా నిర్మించబోయే ‘అనలెమ్మ’ భవనం కూడా ‘8’ ఆకారంలో తిరుగుతూ.. ప్రారంభమైన చోటుకే తిరిగి వస్తుంది. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు.