హైదరాబాద్; సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మసాజ్ సెంటర్లను గతంలో తాము జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలను అనుగుణంగా నిర్వహించే మసాజ్ సెంటర్ల కార్యకలాపాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. పోలీసులు తరుచుగా తమ బ్రాంచీ ల్లో సోదాలు చేస్తున్నరంటూ వెల్నెస్స్పా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. వెల్నెస్, స్పా సెంటర్లకు వచ్చే కస్టమర్ల ఫోన్ నంబర్లు, చిరునామాలను ఆయా కేంద్రాలు రికార్డు చేయాలని, అవసరమైనప్పుడు ఆ రికార్డులను ఎస్సై పైస్థాయి అధికారులు తనిఖీ చేయాలని 2021లో ఇదే హైకోర్టు మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని పేర్కొంటూ విచారణను ముగించారు.