హైదరాబాద్, జూన్ 2 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు తెలంగాణపై, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులపై కనీస గౌరవం లేదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఉద్యమకారుల సేవలను గుర్తుచేస్తూ వారిని ఘనంగా సన్మానించుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌లో అమరవీరులకు కనీస గౌరవం దక్కలేదు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల చిత్రపటాలను అసలు ఏర్పాటే చేయకపోవడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి తెలంగాణ ఉద్యమకారులకు నివాళులర్పిస్తారు. కానీ, వారి చిత్రపటాలకు గాంధీభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో చోటే ఇవ్వకపోగా, నాటి హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రాలో విలీనం చేసిన నెహ్రూ, పోలీస్ యాక్షన్‌కు కారకుడైన పటేల్, తెలంగాణకు సంబంధమే లేని గాంధీ ఫొటోలకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నివాళులర్పించడమేమిటని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. కనీసం తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేని నేతల వల్లే ఈ దుస్థితి నెలకొన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.