హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ సాహిత్య సంస్థ మంజీరా రచయితల సంఘం(మెదక్ జిల్లా) నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని పురసరించుకుని ఈ నెల 2న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో 40 ఏండ్ల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సంస్థ అధ్యక్షుడు కే రంగాచారి అధ్యక్షతన ప్రారంభమయ్యే సదస్సులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ‘మరసం ప్రయాణం-అనుభవాలు‘ అనే అంశంపై జరిగే ప్రారంభ సదస్సులో ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కే విరాహత్ అలీ, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, ప్రముఖ రచయితలు ఎన్ భగవాన్‌రెడ్డి, కే అంజయ్య, కిషన్, తిరుపతిరెడ్డి, తోట అశోక్ తదితరులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రముఖ కవి తైదల అంజయ్య అధ్యక్షతన ‘సాహిత్యం- వివిధ దృక్పథాలు’ అనే అంశంపై రెండో సదస్సు జరుగనున్నది. సాయంత్రం 4 గంటలకు మరసం కార్యదర్శి సిద్దెంకి గిరి, ప్రముఖ కవి పొన్నాల బాలయ్య నిర్వహణలో కవి సమ్మేళనం జరుగనున్నది.