హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పోలీసుల హెచ్చరికలతో మంచు మోహన్‌బాబు కుటుంబంలో సద్దుమణిగిన గొడవ మళ్లీ మొదలైనట్టు కనిపిస్తున్నది. తన ఇంట్లోని జనరేటర్లో సోదరుడు విష్ణు చక్కెర కలిపిన డీజిల్ పోశాడని మనోజ్ ఆరోపించాడు. ఇలా చేయడం వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు అగ్నిప్రమాదం జరిగే అవకాశముందని చెప్పాడు. ఈ మేరకు మనోజ్ ఆదివారం ఎక్స్‌లో ప్రకటన విడుదల చేశాడు.
సోమవారం పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నాడు. తాను, తన భార్య ఇంట్లో లేనప్పుడు తమ అమ్మకు పుట్టినరోజు కేక్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన విష్ణు బౌన్సర్లతో కలిసి జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోశాడని ఆరోపించాడు. ఆ సమయంలో తమ తల్లి, 9 నెలల కూతురు, బంధువులు మాత్రమే ఇం ట్లో ఉన్నారని తెలిపాడు. అర్ధరాత్రి జనరేటర్లు పనిచేయలేదని, విద్యుత్ హె చ్చుతగ్గులు ఏర్పడ్డాయని, ప్రమాదం జరిగేలా కుట్ర చేశారని ఆరోపించాడు.
మోహన్‌బాబు దాడిలో గాయపడ్డ టీవీ రిపోర్టర్ రంజిత్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. దాడి కేసులో పోలీసులు ఇప్పటికే మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం దవాఖానకు వెళ్లిన మోహన్‌బాబు రిపోర్టర్ రంజిత్‌ను పరామర్శించి, క్షమాపణలు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని, అనుకోకుండా జరిగిందని చెప్పారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.