సీసీసీ నస్పూర్, జూలై 15 : ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన నిరుపేద విద్యార్థిని శ్రీరాముల హరితకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల సాయమందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లికి చెందిన హరిత మందమర్రిలోని మహాత్మా జ్యోతిబాపూలే కళాశాలలో చదువుతున్నది. ఇటీవల విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు (468 మార్కులు) సాధించింది. జూన్ 9న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు రాగా, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో విద్యార్థినితోపాటు ఆమె కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను కలిసి తమ ఆర్థిక పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన సీఎం రూ.5 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్లో విద్యార్థిని హరిత, ఆమె తల్లిదండ్రులు రాజేశ్వరి-వెంకటేశ్‌కు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ.5 లక్షల చెక్కును అందజేశారు. బాల్క సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని అన్నారు. ఉన్నత విద్య, విదేశీ విద్య అభ్యసించేలా విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.