మహబూబాబాద్, ఆగస్టు 21 : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఓ వ్యక్తి టీవీ చానల్లో యాడ్ చూసి మోసపోయాడు. చాయ్, మిర్చి అమ్ముతూ పైసాపైసా కూడబెట్టి, చివరికి ఓ మాయగాడికి 18 లక్షలు సమర్పించుకున్నాడు. పట్టణంలోని మసీదు సెంటర్లో టీ అమ్ముకునే మహ్మద్ రజాక్-హబీబా దంపతులు ఓ చానల్లో బాబాజాఫర్ఖాన్ పేరిట ‘ఎలాంటి సమస్యలైనా పరిష్కరించబడును’ అనే యాడ్ చూశారు. తమ సమస్య పరిష్కారం కోసం యాడ్‌లో ఉన్న నంబర్‌ను సంప్రదించారు. అప్పు తీసుకున్న వారి పేరుమీద పూజ చేస్తే వారే ఇంటికొచ్చి తిరిగిస్తారని నమ్మబలికిన బాబాజాఫర్ఖాన్.. పూజకు డబ్బివ్వాలని కోరాడు. దీంతో పలుమార్లు రూ.18 లక్షల వరకు బాబా ఖాతాలో జమచేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాబాను కలిసే ప్రయత్నం చేయగా ఫోన్ పనిచేయలేదు. మోసపోయామని గుర్తించి శనివారం పోలీసులను ఆశ్రయించారు.