యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో పండుగపూట విషాదం నెలకొంది. గాలిపటం ఎగురవేస్తూ బిల్డింగ్ పైనుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో గాలిపటం ఎగురవేస్తూ నరేందర్ అనే వ్యక్తి బిల్డింగ్ పైనుంచి జారిపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నరేందర్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, గాలిపటాలు ఎగరవేసేటప్పుడు కింది జాగ్రతత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్లాస్టర్ చుట్టుకోవాలి
గాలిపటాలు ఎగురేయడంలో ఆనందం ఉంటుంది. దాంతో పాటు అజాగ్రత్తగా ఉంటే ఎనలేని దుఖఃమూ దరిచేరుతుంది. గాలిపటాలు ఎగురవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్ వంటివి చుట్టూకోవాలి. దీని వల్ల మాంజా పూసిన దారం వల్ల చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం జరిగితే, గాయాన్ని శుభ్రంగా కడగాలి. రక్తస్రావం ఆగేందుకు బ్యాండేజితో కట్టేసి, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గాలిపటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగురవేయడమే మేలు.
మిద్దెలు ఎక్కక పోవడమే ఉత్తమం
గాలిపటాలు బాగా ఎత్తున ఎగరాలని చాలా మంది సమీపంలోని మిద్దెలు, ఎతైన గోడలపైకి ఎక్కుతారు. ఇలా ఎక్కి గాలిపటాలను వదిలే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడే అవకాశం ఉంది. ఒకవేళ కిందపడి దెబ్బలు తగిలిన చోట మసాజ్ చేయకూడదు. రక్తస్రావం ఉన్న చోట బ్యాండేజిని వదులుగా చుట్టాలి. గాయాలైన చోట పసుపు కూడా అద్దకూడదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి.
విద్యుత్ తీగలున్న చోటకు వద్దు
గాలి పటాలు ఎగురవేయడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ప్రధానంగా విద్యుత్లైన్లు తగిలిన దానిని కర్రలు, గడలతో లాగేందుకు ప్రయత్నం చేయరాదు. దీనివల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగనట్లయితే సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయలో తెలుపాలి.