గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:42:23

యజమానిని చంపబోయి సహాయకుడి హత్య

యజమానిని చంపబోయి సహాయకుడి హత్య

  • వీడిన బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలో యువకుడి హత్య కేసు
  • ఐదుగురు నిందితుల అరెస్ట్‌,  సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాధీనం

మన్సూరాబాద్‌: హైదరాబాద్‌ శివారు బాలాపూర్‌లో ఈ నెల 23న జరిగిన ఓ యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపార లావాదేవీలలో తలెత్తిన వివాదం కారణంగానే హత్య జరిగినప్పటికీ.. యజమాని అనుకొని సహాయకుడిని హతమార్చినట్టు విచారణలో తేలింది. సోమవారం ఎల్బీనగర్‌లోని సీపీక్యాంపు ఆఫీస్‌లో డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ కేసు వివరాలను వెల్లడించారు. బాలాపూర్‌ మండలం వాది ఏ ముస్తాఫా కాలనీకి చెందిన మహ్మద్‌ పర్వేజ్‌, ఇదే కాలనీకి చెందిన ఫర్హాన్‌తో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంచేస్తున్నాడు. ఫర్హాన్‌ వద్ద ముస్తాఫా కాలనీకి చెందిన సయిద్‌ మోయిన్‌ అలీ (24) సహాయకుడిగా ఉన్నాడు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి కోసం మహ్మద్‌ పర్వేజ్‌ రూ.9లక్షలు ఫర్హాన్‌కు ఇచ్చాడు. ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా ఫర్హాన్‌ ఇబ్బంది పెట్టడంతో పర్వేజ్‌ అతన్ని చంపాలను కున్నాడు. రూ.2లక్షలతో బేరం కుదుర్చుకొని సుపారీ ఇచ్చాడు. 23న ఫర్హాన్‌ ఇంటినుంచి  అలీతోపాటు మరో యువకుడు బైక్‌పై బయటకు వస్తుండగా, అలీని ఫర్హాన్‌గా భావించిన హంతకులు కత్తులతో దాడిచేసి హత్యచేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టుచేసిన పోలీసులు కత్తులు, 9 సెల్‌ఫోన్లు, 3 బైక్‌లను స్వాధీనంచేసుకున్నారు.


logo