కరీమాబాద్, జూన్ 9 : తమ స్థలాన్ని ఆక్రమించడమేగాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వరంగల్ ఉర్సు ప్రాంతానికి చెందిన పోలెపాక కుమారస్వామి అనే వ్యక్తి బైపాస్‌రోడ్డులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పోలెపాక కుమారస్వామి తండ్రికి ఉర్సు శివారులో ఆరున్నర ఎకరాల స్థలం ఉన్నది. కాంగ్రెస్ నాయకుడు బండి కుమారస్వామి.. పోలెపాక కుమారస్వామి కుటుంబ సభ్యులను బెదిరించి కాగితా లపై సంతకాలు చేయించుకున్నాడని తెలుస్తున్నది. స్థలంలోకి వెళ్తే పులి రంజిత్‌రెడ్డి అనే వ్యక్తి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. మనస్తాపానికి గురైన పోలెపాక కుమారస్వామి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సమస్యలపై ఉద్యమం ఉధృతం : ఆర్టీసీ జేఏసీ
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర క్యాబినెట్లో ప్రస్తావించకపోవడాన్ని ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌లో జేఏసీ సమావేశాన్ని నిర్వహించింది. క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రస్తావించకపోవడం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్మరించడంపై జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-చైర్మన్ కే హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి ఖండించారు. కార్మిక సమస్యలు పరిష్కరించుకోవటానికి ఉద్యమాన్ని ఉధృతం చేయడమే ఏకైక లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టంచేశారు. ఆర్టీసీలో ఉమ్మడి ఎజెండాతో, ఐక్యతతో ముందుకుపోవడానికి ఈనెల 13న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అన్ని కార్మిక సంఘాలతో సమావేశాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జాక్ ప్రతినిధులు జే రాఘవులు, ఎన్ కమలాకర్‌గౌడ్, నరేందర్, రమేశ్, మజీద్, బీ పాపయ్య, కేఎస్ పాల్, బీ శ్రీనివాస్, పీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు.